రాష్ట్రంలో ఫిబ్రవరి19 నుంచి టీజీఎప్ సెట్ దరఖాస్తులు

రాష్ట్రంలో ఫిబ్రవరి19 నుంచి టీజీఎప్ సెట్ దరఖాస్తులు
  •     మే 4 నుంచి అగ్రి, 9 నుంచి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్
  •     షెడ్యూల్ రిలీజ్ చేసిన టీజీసీహెచ్ఈ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల భర్తీకి నిర్వహించే ‘టీజీఎప్​ సెట్–2026’ షెడ్యూల్ రిలీజ్ అయింది.  ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. శుక్రవారం జేఎన్టీయూహెచ్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్) చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ఈఏపీ సెట్ కమిటీ సమావేశమైంది. దీనిలో షెడ్యూల్, దరఖాస్తుల ప్రక్రియతో పాటు కొత్త రిఫామ్స్ పై చర్చించారు. అనంతరం వర్సిటీ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, కన్వీనర్ విజయకుమార్ రెడ్డితో కలిసి ఆయన వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు స్వీకరిస్తారు. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి చాన్స్ ఉంది. 

ఈసారి ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ సిలబస్ మొత్తం ఉంటుందని అధికారులు క్లారిటీ ఇచ్చారు.  మే నెలలో రెండు విడతలుగా ఎగ్జామ్స్ జరగనున్నాయి. ముందుగా అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలను మే 4, 5 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు మే 9 నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఎగ్జామ్స్ జరుగుతాయి. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్​కే మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, జేఎన్టీయూ రిజిస్ర్టార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

వచ్చే నెల 23న పీజీఈసెట్ నోటిఫికేషన్

ఎంటెక్, ఎంఫార్మసీ వంటి పీజీ కోర్సుల్లో చేరేవారి కోసం నిర్వహించే ‘టీజీ పీజీఈసెట్–2026’ నోటిఫికేషన్​ను ఫిబ్రవరి 23న రిలీజ్ చేయనున్నారు. జేఎన్టీయూహెచ్ లో టీజీసీహెచ్​ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన పీజీఈసెట్ కమిటీ సమావేశమైది. ఈ సందర్భంగా షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 27 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, మే 6 వరకూ ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. గేట్, జీప్యాట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని, మిగిలిన సీట్లను పీజీఈసెట్ ర్యాంకు ద్వారా భర్తీ చేస్తామని వివరించారు.