- హాజరుకానున్న 2.10 లక్షల మంది విద్యార్థులు
- 125 సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి టీజీ ఎప్ సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రవేశ పరీక్షలకు మొత్తం 2,10,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎప్ సెట్ కన్వీనర్ డాక్టర్ కె. విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం తెలంగాణ, ఏపీలో కలిపి మొత్తం 125 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. తొలిరోజు మే 9న 69,631 మంది, మే 10న - 70,610 మంది, మే 11న -70,525 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్‌తో పాటు కనీసం ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ లేదా ఇతర గుర్తింపు కార్డు) తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. క్యాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచీలు, సెల్ ఫోన్లు, లాగ్ టేబుల్స్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరీక్షా హాల్లోకి అనుమతించబోరు.
నిమిషం లేటైనా నో ఎంట్రీ
పరీక్షా నిబంధనలను అధికారులు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం సెషన్ పరీక్షకు 7:30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 1:30 గంటల నుంచే విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభ సమయం ఉదయం 9 గంటలు / మధ్యాహ్నం 3 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా సెంటర్లోకి అనుమతించే ప్రసక్తే లేదని కన్వీనర్ విజయకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే పరీక్ష ముగిసే వరకు విద్యార్థులను బయటకు పంపబోరని వెల్లడించారు.
స్క్రీన్‌పైనే ప్రాథమిక మార్కులు..
కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో జరిగే ఈ పరీక్ష ముగియగానే, విద్యార్థులు సాధించిన మార్కులు వారి కంప్యూటర్ స్క్రీన్‌పైనే కనిపిస్తాయి. కానీ తుది ర్యాంకులను మాత్రం నార్మలైజేషన్ పద్ధతిలో నిర్ణయిస్తామని అధికారులు వెల్లడించారు. పరీక్ష సమయంలో కంప్యూటర్ వ్యవస్థలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే, ఆ సమయాన్ని అదనంగా కేటాయించి విద్యార్థులకు న్యాయం చేస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. విద్యార్థులు గందరగోళానికి గురికాకుండా తమ సెంటర్లను ముందే చూసుకోవాలని సూచించారు.
