- దర్యాప్తులో స్పీడ్ పెంచిన టీజీ న్యాబ్ అధికారులు
- రంగంలోకి ప్రత్యేక బృందాలు
- ఎవరు డ్రగ్స్ సప్లై చేశారనే కోణంలో ఇన్వెస్టిగేషన్
- జైలుకెళ్లి వచ్చినా తీరు మార్చుకోని పబ్ నిర్వాహకులు
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ ఖాజాగూడలోని ది కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో టీజీ న్యాబ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 25 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో వారికి నోటీసులు జారీ చేశారు. వీరిలో డీజే ఆపరేటర్లు, పార్టీ ఆర్గనైజర్లు కూడా ఉన్నట్టు సైబరాబాద్ ఎస్వోటీ, రాయదుర్గం, ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. కాగా, ఈ కేసులో పబ్ ఓనర్లు నలుగురు పరారీలో ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు వివరించారు. సైకెడెలిక్ పేరుతో పబ్ నిర్వాహకులు పార్టీని ఏర్పాటు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా దీనిపై ప్రచారం చేశారు. ఫారెస్ట్ అల్కెమీ అంటూ కోడ్ లాంగ్వేజ్‌లో మత్తు పార్టీ ఆర్గనైజ్ చేశారు. పార్టీకి అటెండ్ అయ్యేవాళ్లంతా ఎవరికి వారు పబ్ బయటే డ్రగ్స్ తీసుకొని రావాలని కండీషన్ పెట్టారు. ఈ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నవాళ్లు మాత్రమే డీజే సౌండ్‌ను తట్టుకోగల్గుతారు. కాగా, డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన వారికి కొకైన్, గంజాయి, ఎండీఎంఏ సప్లై చేసింది ఎవరనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ అమ్మిన వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
సిటీలో పెరిగిన మత్తు పదార్థాల వాడకం
హైదరాబాద్ సిటీలో గంజాయి, కొకైన్, ఎండీఎంఏ వాటకం ఎక్కువైంది. ఫైవ్ స్టార్ హోటల్స్, పబ్‌లు మొదలుకొని కిరాణ షాపుల్లో కూడా మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. వీటిని అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డ వారు.. జైలుకు వెళ్లి వచ్చాక తిరిగి అదే దందా చేస్తున్నారు. నానక్‌రాంగూడలో ఓ మహిళ కిరాణ షాపు ముసుగులో గంజాయి అమ్ముతూ పలుమార్లు పోలీసులకు చిక్కింది. జైలుకు కూడా వెళ్లి వచ్చింది. అయినా, ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ గంజాయి అమ్ముతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల సైబరాబాద్ పోలీసులు ఆమెపై పీడీ యాక్ట్ పెట్టారు. ఇలా పలువురు డ్రగ్స్ పెడ్లర్లు.. మత్తు పదార్థాలు అమ్ముతూ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చినా తిరిగి అవే అమ్ముతున్నరు. డ్రగ్స్ కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మార్పు రావడం లేదు.
కస్టమర్లను ఆకట్టుకునేందుకు కోడ్ లాంగ్వేజీలు
హైదరాబాద్ సిటీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను కొన్ని పబ్బులు డ్రగ్స్ పార్టీతో డ్యామేజ్ చేస్తున్నాయి. అడ్డదారిలో డబ్బులు సంపాధించాలనే ఆలోచనలతో పబ్‌లలో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు స్పెషల్ కోడ్ లాంగ్వేజ్‌లు వాడుతున్నాయి. పబ్‌కు వచ్చేవారికి గంజాయి, కొకైన్, ఎండీఎంఏ సప్లై చేస్తూ మత్తులో ముంచేస్తున్నరు. డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కిన వారిలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, స్టూడెంట్లు ఉంటున్నారు. డ్రగ్స్ కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. నిత్యం ఏదో ఒక చోట మత్తు పార్టీలు, డ్రగ్స్ తీసుకుంటూ దొరుకుతూనే ఉన్నారు.
