
కర్నూలు : రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్ చేశారు. కర్నూలులో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని మారబోతోందని చెప్పారు. కేంద్రం ప్రభుత్వంతో వైసీపీ నేతలు కూడా ఈ అంశంపై చర్చ జరిపారని అన్నారు. నాలుగు జోన్లుగా విభజించి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని.. వైసీపీ ప్రభుత్వం నిర్ణయానికొచ్చిందని అన్నారు. రాజధాని ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల మిగతా ప్రాంతాలు అభివృద్దికి నోచుకోవడం లేదన్నారు. అమరావతిలో ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధీ జరగడం లేదని అన్నారు.
ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ టీజీ వెంకటేశ్… రాజధాని మార్పుపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని చెప్పారు. రాజధాని అభివృద్ధి జరిగి ఉంటే మంగళగిరి ప్రాంతంలో లోకేష్ ఒడిపోయే వారు కాదన్నారు. రాజధాని ప్రాంతం రైతులు.. జగన్ కు ఓటు వేశారు అంటే.. అక్కడ వారికి అన్యాయం జరిగిందని అర్థం చేసుకోవాలన్నారు. కాంక్రీట్ జంగిల్ గా మార్చడాన్ని అక్కడి ప్రజలు ఒప్పుకోవడం లేదన్నారు. మొత్తం ఫోకస్ అమరావతి లోనే పెడితే… మిగతా ప్రాంతాల్లో అసంతృప్తి.. అశాంతి ఏర్పడుతుందనీ.. ఇది మరో విభజన వాదానికి దారితీయొచ్చని అభిప్రాయపడ్డారు టీజీ వెంకటేశ్.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంచి పరిపాలన అందిచబోతోందని చెప్పారు టీజీ వెంకటేశ్. కర్నూలు జిల్లాలో రాజధాని ప్రకటిస్తే బాగుంటుందని అన్నారాయన. అమరావతి కేవలం పరిపాలన కేంద్రంగా ఉండబోతోందని చెప్పారు. రాష్ట్రంలో మరో నాలుగు రాజధానులు రావొచ్చనీ.. లేదా వాటినే రీజనల్ సెక్రటేరియట్ లు.. లేదా రీజనల్ బోర్డులు అని పిలవొచ్చని చెప్పారు టీజీ. నలుగురు డెప్యూటీ సీఎంల ఆధ్వర్యంలో నాలుగు రాజధానుల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు.
కేసీఆర్ తో జాగ్రత్త
అయితే కేసీఆర్ తో జగన్ జాగ్రత్తగా ఉండాలనీ.. కేసీఆర్ తో కలసిన వారెవరూ బాగుపడలేదని అన్నారు టీజీ. కేసీఆర్ ను కలిసిన వారు మిణుగురు పురుగుల్లా మాడిపోతారనీ.. రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లయినా కేసీఆర్ ఆంధ్రకు ఇవ్వాల్సిన ఆస్తులు.. అప్పుల గురించి మాట్లాడడం లేదని అన్నారు. వీటి గుర్తించి మాట్లాడకుండా గోదావరి జలాలను సీమకు పారిస్తామంటే ఎవరూ నమ్మరని అన్నారు. కేసీఆర్ ను నమ్మి వేల కోట్లు పెట్టుబడి పెడితే మోసపోతారని చెప్పారు టీజీ వెంకటేశ్.
రాష్ట్రంలో నాలుగు కొత్త రాజధానులు గాని.. బోర్డులు పెట్టి అభివృద్ధి చేసే దిశలో జగన్ ముందుకు వెళ్తున్నారు. నేను స్వాగతిస్తున్నాము.