గురుకులాల్లో బదిలీల షెడ్యూల్ విడుదల చేయండి..మంత్రి లక్ష్మణ్ కు వినతిపత్రం అందజేసిన టీజీఏఆర్ఐఈఏ

గురుకులాల్లో బదిలీల షెడ్యూల్ విడుదల చేయండి..మంత్రి లక్ష్మణ్ కు వినతిపత్రం అందజేసిన టీజీఏఆర్ఐఈఏ

హైదరాబాద్, వెలుగు: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగుల బదిలీల షెడ్యూల్‌‌ను వెంటనే విడుదల చేయాలని టీజీఏఆర్ఐఈఏ  (   తెలంగాణ ప్రభుత్వ  రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఉద్యోగుల సంఘం )నేతలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని కోరారు. బదిలీలు పూర్తయిన తరువాత ప్రమోషన్లు కల్పించాలన్నారు.  మంగళవారం యూనియన్ ప్రెసిడెంట్ నర్సింహులు గౌడ్, జనరల్ సెక్రటరీ గణేశ్ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 1600 ప్రమోషన్లు పెండింగ్‌‌లో ఉన్నాయని తెలిపారు.

ప్రమోషన్లు ఆలస్యమవడంతో అనేక మంది ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతుండగా, కొంతమంది ఉద్యోగులు ప్రమోషన్లు పొందకుండానే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీల ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తే సుమారు 2400 మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారన్నారు. బదిలీలు, ప్రమోషన్ల ద్వారా మొత్తం 4వేల మందికి పైగా గురుకుల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మే, జూన్ నెలల్లోనే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రిని కోరారు