జూన్ 2 నాటికి పీఆర్సీ ప్రకటించాలి : వి.లచ్చిరెడ్డి

 జూన్ 2 నాటికి పీఆర్సీ ప్రకటించాలి : వి.లచ్చిరెడ్డి
  • తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ 
  • పెండింగ్ బిల్లులు, డీఏలు ఇవ్వాలి
  • సమస్యల పరిష్కారానికి కార్యాచరణ
  • టీజీఈ జేఏసీ  విస్తృతస్థాయి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం

హైదరాబాద్, వెలుగు: జూన్ 2 నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ డిమాండ్​చేశారు. పెండింగ్​లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో టీజీఈ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ప‌‌లు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాల‌‌ని స‌‌మావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి, రాజశేఖర్ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ జారీ  చేయాలన్నారు.

 సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ విధానం అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 ఏండ్లు నిండిన వీఆర్ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యను పరిష్కరించాలని కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలని సూచించారు.

 ఇందులో భాగంగా ఏప్రిల్ 17న మండల, డివిజన్ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో తహసీల్దార్లకు మెమోరాండం, మే 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేసి, ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యతను తీసుకుంటామన్నారు. సమావేశంలో తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.రాములు, జనరల్ సెక్రటరీ రమేశ్ పాక, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, కమర్షియల్ టాక్స్ అసోసియేషన్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, అగ్రి డాక్టర్స్, ఎంప్లాయీస్, సీపీఎస్ ఎంప్లాయీస్, పబ్లిక్ హెల్త్, జీపీవో, జ్యుడీషియల్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ప్రభుత్వ ఫార్మాసీ ఆఫీసర్స్, మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్, ఔట్ సోర్సింగ్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ టీచర్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు, టీజీబీసీ ఉపాధ్యాయ సంఘం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, మజ్దూర్ యూనియన్, మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.