ఇంజినీరింగ్‌లో 81,904 మందికి సీట్లు.. TGEAPCET ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్

ఇంజినీరింగ్‌లో 81,904 మందికి సీట్లు.. TGEAPCET ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ ఫస్టియర్ లో ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఫేజ్ లో కొత్తగా 9881 మందికి సీట్లు అలాట్ కాగా, మరో 16,981 మంది కాలేజీలను మార్చుకున్నారు. సోమవారం ఎప్ సెట్ సీట్ల అలాట్ మెంట్ వివరాలను అధికారులు ప్రకటించారు.  మొత్తం 175 కాలేజీల్లో 86,943 సీట్లు ఉండగా, ఇప్పటి వరకూ 81,904 మందికి సీట్లు కేటాయించారు. 

మరో 5039 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 6460 మందికి సీట్లు అలాట్ అయ్యాయి.  రాష్ట్రంలో 90 ఇంజినీరింగ్ కాలేజీల్లో వందశాతం అడ్మిషన్లు  అయ్యాయి. వీటిలో ఆరు సర్కారు వర్సిటీలుండగా, మరో 84 ప్రైవేటు కాలేజీలున్నాయి. కొత్తగా ప్రారంభించిన కోస్గి గవర్నమెంట్ కాలేజీలో 198 సీట్లుకు గానూ 105 సీట్లు భర్తీ అయ్యాయి. కాగా, 154 ప్రైవేటు కాలేజీల్లో 79,436 సీట్లకు 75,555 సీట్లు నిండగా, 18 వర్సిటీ కాలేజీల్లో 5933 సీట్లకు 4877 సీట్లు నిండాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 15 లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. 

94శాతం సీట్లు నిండినయ్..

రాష్ట్రంలోని 47 బ్రాంచుల్లో 94.20శాతం నిండాయి. దీంట్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో 60,362 సీట్లు నిండగా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ర్టికల్ అనుబంధ బ్రాంచుల్లో 14,907 సీట్లు నిండాయి. సివిల్, మెకానికల్ బ్రాంచుల్లో 5,782 సీట్లు భర్తీకాగా, ఇతర కోర్సుల్లో 1,206 సీట్లకు 853 సీట్లు నిండాయి.