పీఆర్‌‌‌‌సీ నివేదికను విడుదల చేయండి : టీజీఈజేఏసీ

పీఆర్‌‌‌‌సీ నివేదికను విడుదల చేయండి : టీజీఈజేఏసీ
  • ప్రభుత్వానికి టీజీఈజేఏసీ లెటర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించి పీఆర్‌‌‌‌ సీ నివేదికను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ  (టీజీఈజేఏసీ) డిమాండ్ చేసింది. ఈ మేర కు టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ గురువా రం సీఎస్ రామకృష్ణారావుకు అధికారికంగా లేఖ రాశారు. 2023లో ఏర్పాటు చేసిన పీఆర్‌‌‌‌సీ కమిటీ ఇప్పటికే ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించి, సమీక్ష ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ.. నివేదికను బయ టపెట్టకపోవడంపై జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పీఆర్‌‌‌‌సీ సిఫార్సులు వాస్తవానికి 2024 ఏప్రిల్ నాటికే రావాల్సి ఉందని, గడువు ముగిసినా నివేదిక రాకపోవడంతో ఉద్యోగులు తమ హక్కులను కోల్పోతున్నారని లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల ధర లు ఆకాశాన్ని తాకుతున్నాయని, దీంతో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, గృహ రుణాల ఈఎంఐలు చెల్లించలేక సగటు ఉద్యోగి నెలకు సుమారు  20 వేల వరకు లోటు బడ్జెట్‌‌‌‌తో జీవిస్తున్నారని వివరించారు. ఇకపై గడువును పొడిగించకుండా, వెంటనే నివేదికను బహిర్గతం చేసి అమలు చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని టీజీఈజేఏసీ విజ్ఞప్తి చేసింది.