- బోధనలో బాగున్నాం.. పరిశోధనల్లో వెనుకబడ్డాం
- టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, వెలుగు: జాతీయ స్థాయి ర్యాంకింగ్స్ కేవలం అంకెల కోసం కాదని, యూనివర్సిటీలకు నిధులు రావాలన్నా.. అక్రిడిటేషన్ దక్కాలన్నా ‘నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో సత్తా చాటడం తప్పనిసరి అని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలు ఈ ర్యాంకింగ్ కోసం పాల్గొంటున్నా.. టీచింగ్, విస్తరణలో ఉన్న పట్టు పరిశోధనల వైపు కన్పించడం లేదని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో.. రాష్ట్రంలోని 16 సర్కారు వర్సిటీల కోసం ‘ఎన్ఐఆర్ఎఫ్’పై నిర్వహించిన వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకిష్టా రెడ్డి మాట్లాడారు.
పేటెంట్లు, నిధులు పొందే ప్రాజెక్టులు, అకడమిక్ రెప్యూటేషన్ వంటి కీలక అంశాల్లో మన వర్సిటీలు ఇంకా బలపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్ఐఆర్ఎఫ్ ను కేవలం ఒక వాల్యుయేషన్ టూల్‌గా చూడొద్దని, వర్సిటీల దీర్ఘకాలిక వ్యూహాత్మక అభివృద్ధికి దీన్నొక గైడ్‌లైన్‌గా మార్చుకోవాలన్నారు. అనంతరం వర్సిటీల అభివృద్ధిలో ర్యాంకింగ్స్ ప్రభావంపై టీజీసీహెచ్ఈ వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్ కె మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కె. వీరాంజనేయులు, కె. వెంకటేశ్ తో పాటు ఓయూ, కేయూ, జేఎన్టీయూహెచ్ సహా రాష్ట్రంలోని 16 వర్సిటీల నుంచి 50 మంది పాల్గొన్నారు.
