
- టీజీహెచ్ఎంఏ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్షా విభాగంలో ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లు నిర్వహిస్తున్న కో ఆర్డినేటర్ల పోస్టుల్లో గెజిటెడ్ హెడ్మాస్టర్లను నియమించాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం (టీజీహెచ్ఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. గతంలో హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉండటంతో తాత్కాలికంగా స్కూల్ అసిస్టెంట్లను కోఆర్డినేటర్లుగా నియమించారని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆ ఖాళీలన్ని ప్రమోషన్ల ద్వారా భర్తీ అయ్యాయని ఆయన చెప్పారు.
ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, జీహెచ్ఎంలను సమన్వయం చేసుకుని పనిచేయాల్సిన బాధ్యత కో ఆర్డినేటర్లదని, స్కూల్ అసిస్టెంట్లు తమ కంటే పై స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఇబ్బందికరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది విద్యావ్యవస్థలో పరిపాలనా సామర్థ్యాన్ని, క్రమశిక్షణను దెబ్బతీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.