ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అందించాలి : టీజీఎండీసీ ఎండీ భవేశ్ మిశ్రా

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అందించాలి : టీజీఎండీసీ ఎండీ భవేశ్ మిశ్రా

  శాంతినగర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించాలని, ఇసుక రవాణా, తరలింపులో ఎలాంటి సమస్యలు రానివ్వమని టీజీఎండీసీ ఎండీ భవేశ్​ మిశ్రా తెలిపారు. బుధవారం ఆయన మైనింగ్  శాఖ జిల్లా అధికారులతో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తమ్మిళ్ల గ్రామంలోని ఇసుక రీచ్​లను పరిశీలించారు. తుంగభద్ర నదిలో ప్లెడ్జింగ్  సిస్టమ్  ద్వారా తీస్తున్న ఇసుకను పరిశీలించారు. ఇసుక తవ్వకాలు ఎందుకు నిలిచిపోయాయని ఆయన అడిగి తెలుసుకున్నారు. 

నదిలో వరద ఎక్కువగా ఉన్నందున ఇసుక తీయడం కుదరడం లేదని, నీటి ఉధృతి తగ్గగానే ఇసుక తీస్తామని జిల్లా అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఇసుకను ఇందిరమ్మ ఇండ్లకు అందిస్తున్నామని కాంట్రాక్టర్లు తెలిపారు. తీసిన ఇసుకను లబ్ధిదారులకు ఎలా పంపుతున్నారనే విషయాన్ని ఆరా తీశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం ఇసుక సకాలంలో అందజేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏడీ వెంకటరమణ, ప్రసాద్ బాబు, తహసీల్దార్  పి.రామ్మోహన్, సీఐ టాటా బాబు పాల్గొన్నారు.