
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ బోర్డులో నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని..దీనిపై సమగ్ర విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు మాచర్ల రామకృష్ణగౌడ్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎంవోలో ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ బ్యాంకుల్లో ఉంచాల్సిన ఇంటర్ బోర్డు నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రైవేటు బ్యాంకులకు మార్చినట్లు రామకృష్ణగౌడ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. బోర్డు యాక్ట్‌కు విరుద్ధంగా 6వేల సీసీ కెమెరాలను కొనుగోలు చేశారని, మరో 2 వేల కెమెరాలను కిరాయికి తీసుకున్నారని చెప్పారు. అంతేకాకుండా, బోర్డులో రెనోవేషన్ పనులు చేపట్టారని కూడా తెలిపారు.
కాలేజీల్లో అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ కమిటీ అనుమతి లేకుండా ఫైర్ సేఫ్టీ పరికరాలు కొనుగోలు చేశారని, డిపార్ట్‌మెంటల్ ప్రొక్యూర్‌మెంట్ కమిటీ (డీపీసీ)ని ఏర్పాటు చేశారని వివరించారు. సర్కారు కాలేజీల్లో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టకుండానే నిర్మాణం చేసినట్లు సర్కారుకు తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపించారు.