- 86 సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు
- ఈ నెల 24 నుంచి జులై 29 వరకు దరఖాస్తుకు గుడువు
- నవంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించే చాన్స్
- నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ
టీజీపీఎస్సీ మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డైట్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిలో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు, 63 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నుంచి మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్ కాలేజీలు) ఖాళీగా ఉన్న 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ ఇచ్చింది.
దీనిలో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు, 63 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ హరిత అధికారిక ఉత్తర్వులు రిలీజ్ చేశారు. ఆయా పోస్టులకు ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం కానుండగా, జులై 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకునేందుకు గడువు ఇచ్చారు. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. నవంబర్ నెలలో రాత పరీక్షలు (ఆబ్జెక్టివ్ టైప్) నిర్వహించే అవకాశం ఉందని ప్రకటించింది.
మొత్తం 450 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పేపర్-1 (జనరల్ స్టడీస్) 150 మార్కులకు, పేపర్-2 (సబ్జెక్ట్ నాలెడ్జ్) 300 మార్కులకు ఉంటుంది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్‌సైట్ www.tgpsc.gov.in చూడాలని కమిషన్ సూచించింది. అభ్యర్థులు ముందుగా టీజీపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ఐడీతో లాగిన్ అయ్యి అప్లై చేయాలని కోరారు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.వెయ్యి, ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలని తెలిపింది.
పోస్టులు ఇవే..
మొత్తం 19 కేటగిరీల్లో ఈ 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా సీనియర్ లెక్చరర్ పోస్టులు 23 ఉండగా.. ఇన్‌సర్వీస్ ట్రైనింగ్ లెక్చరర్లు 16 ఉన్నాయి. తెలుగులో 8, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల్లో మూడేసి పోస్టులు, ఎడ్యుకేషన్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. ఇక ఉర్దూ మీడియం కేటగిరీలో ఎడ్యుకేషన్ 4, మ్యాథ్స్ 2, సైన్స్ 2, సోషల్ 2, ఉర్దూ లాంగ్వేజ్ ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. వీటితో పాటు సైకాలజీ, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల్లో మూడేసి పోస్టులు.. ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ విభాగాల్లో రెండేసి ఖాళీలతో పాటు ఫిలాసఫీ సబ్జెక్టులో ఒక పోస్టును ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు.
