గుడ్ న్యూస్.. ‘గ్రూప్-1’ పై పిటిషన్లు డిస్మిస్.. టీజీపీఎస్సీ మూల్యాంకన విధానాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు

గుడ్ న్యూస్.. ‘గ్రూప్-1’ పై పిటిషన్లు డిస్మిస్.. టీజీపీఎస్సీ మూల్యాంకన విధానాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు

 తెలంగాణ గ్రూప్‌‌‌‌–1 నియామక ప్రక్రియపై నెలకొన్న న్యాయపరమైన సందిగ్ధతకు లైన్ క్లియర్ అయింది. టీజీపీఎస్సీ చేపట్టిన 563 పోస్టుల నియామక ప్రక్రియ చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో -టీజీపీఎస్సీ మూల్యాంకన విధానాన్ని ధర్మాసనం సమర్థించింది.

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ గ్రూప్‌‌‌‌–1 నియామక ప్రక్రియపై నెలకొన్న న్యాయపరమైన సందిగ్ధతకు లైన్ క్లియర్ అయింది. టీజీపీఎస్సీ చేపట్టిన 563 పోస్టుల నియామక ప్రక్రియ చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ మూల్యాంకన విధానాన్ని ధర్మాసనం సమర్థించింది. అలాగే, నియామకాల ప్రక్రియపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తున్నట్టు తెలిపింది. ఈ నియామకాలను సవాల్​ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లను(ఎస్ఎల్పీలను) కొట్టివేసింది.   

గ్రూప్ –1 నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లను విచారించిన సింగిల్ జడ్జి.. గ్రూప్-–1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, పారదర్శకత లోపించిందనే కారణాలతో మార్కుల తుది జాబితా, జనరల్ ర్యాంకులను రద్దు చేయడంతోపాటు జవాబు పత్రాలను పునర్ మూల్యాంకనం చేయాలని తీర్పునిచ్చారు. లేనిపక్షంలో తాజాగా పరీక్షలు నిర్వహించాలంటూ టీజీపీఎస్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.  

దీంతో సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ సహా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టు డివిజన్ బెంచ్‌‌‌‌ను ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. కాగా, హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును గత నెల 9న ఆదిత్య, అవినాశ్‌‌‌‌యాదవ్‌‌‌‌, మరికొందరు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీలు దాఖలు చేశారు. 

ఆ పిటిషన్లపై గురువారం జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కమిషన్ తరఫున సీనియర్ అడ్వకేట్ నిరంజన్‌‌‌‌రెడ్డి, పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ సహా ఇతర న్యాయవాదులు వాదనలు వినిపించారు.