‘రెట్రో ఫిట్మెంట్’పై ఆర్టీసీ దృష్టి..గ్రేటర్లో2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులు

‘రెట్రో ఫిట్మెంట్’పై ఆర్టీసీ దృష్టి..గ్రేటర్లో2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులు
  • ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడి

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు వేస్తున్నదని, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా రికార్డ్ సృష్టించిందని తెలిపారు.

పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ‘రెట్రో ఫిట్మెంట్’ సాంకేతికతపై దృష్టి సారించినట్లు చెప్పారు. 2023లో ముషీరాబాద్ డిపోకు చెందిన ఒక డీజిల్ బస్సును ప్రైవేటు సంస్థ సహకారంతో ఎలక్ట్రిక్ బస్సుగా మార్చి ఉప్పల్ డిపోలో విజయవంతంగా నడుపుతున్నామని,  హైదరాబాద్ భవిష్యత్తు కోసం తీసుకొస్తున్న ఈ హరిత ప్రయాణాన్ని ప్రజలు ఆదరించాలని, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం బస్ భవన్​లో ఆయన మాట్లాడుతూ.. గతేడాది సెప్టెంబరులో టెండర్లు పిలిచి సాయి గ్రీన్ మొబిలిటీకి 200 బస్సులు, కల్యాణి పవర్ ట్రైన్ లిమిటెడ్​కు 40 బస్సులను రెట్రో ఫిట్మెంట్ చేసే బాధ్యత అప్పగించామన్నారు. ప్రస్తుతం నగరంలో ఆరు డిపోల పరిధిలో 325 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, ఈ ఏడాదిలో మరో 175 బస్సులు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.

కొత్తగా 19 డిపోలలో చార్జింగ్ పాయింట్లు ఏర్పాటుతోపాటు 10 డిపోలు, 10 చార్జింగ్ కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.392 కోట్ల  వ్యయం అవుతుందని అంచనా వేశారు.