- నోటీస్ ఇచ్చి కరెంట్ కట్ చేయండి
- పోలీసుల సాయం తీసుకోండి
- నవంబర్ వరకు డెడ్ లైన్
- టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి. పాటిల్
హైదరాబాద్ సిటీ, వెలుగు: పాత బస్తీలో కరెంట్ బిల్లులు కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి.పాటిల్ అన్నారు.
హైదరాబాద్ సౌత్ సర్కిల్లో బిల్లులను సరిగ్గా వసూలు చేయడం లేదని, ఇక్కడ రూ.68.48 కోట్ల బకాయిలు ఉంటే.. చార్మినార్ డివిజన్లోనే 35.18 కోట్లు రావలసి ఉన్నదని చెప్పారు. మూడు రోజుల కింద ఆయన అధికారులతో నిర్వహించిన సమావేశంలో పెండింగ్ బిల్లుల అంశం చర్చకు వచ్చింది.
ఆయన మాట్లాడుతూ చార్మినార్ డివిజన్లోని హుస్సేనీ ఆలం, శాలిబండ, మొగల్ పురా, మీరాలమ్, చార్మినార్ ప్రాంతాల్లోనే 35 కోట్లకు పైగా రావాల్సి ఉందన్నారు. ఇటీవల నాంపల్లి, కాచిగూడ, సరూర్ నగర్ ప్రాంతాల్లో బిల్లులు వసూలుకు వెళ్లిన సిబ్బందిపై దాడి విషయం ప్రస్తావనకు రాగా, బిల్లులు చెల్లించని వారికి నోటీసులు ఇవ్వాలని, అయినా చెల్లించకపోతే పోలీసుల సాయంతో కరెంట్ కట్ చేయాలన్నారు.
ఎక్కడెక్కడ ఎంత రావాలంటే..
క్యూర్ పరిధిలో 2026 అక్టోబర్ 1 నాటికి ఎల్టీ కనెక్షన్లకు సంబంధించి రూ.178.48 కోట్లు, హెచ్‌టీ కనెక్షన్లవి రూ. 70.43 కోట్లు రావాల్సి ఉందని సీఎండీ తెలిపారు. మేడ్చల్‌లో రూ. 34.40 కోట్లు, హైదరాబాద్ సెంట్రల్‌లో రూ. 29.93 కోట్లు, మేడ్చల్‌లో రూ. 11.32 కోట్లు, సైబర్ సిటీలో రూ. 10.61 కోట్ల చొప్పున బకాయిలు ఉన్నాయన్నారు. ఫలక్‌నుమా డివిజన్లో రూ. 23.58 కోట్లు, మెహదీపట్నంలో రూ. 22.46 కోట్లు, అస్మాన్‌గఢ్‌లో రూ. 20.04 కోట్లు, బేగంబజార్‌లో రూ. 13.26 కోట్ల మేర కరెంట్ బిల్లులు పేరుకుపోయాయన్నారు.
