
- సద్దుల బతుకమ్మ, దసరా కోసం6,304 ప్రత్యేక బస్సులు
- ఆర్టీసీకి పోలీస్, రవాణా శాఖ సహకరించాలి: సజ్జనార్
హైదరాబాద్, వెలుగు: సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా టీజీఎస్ ఆర్టీసీకి సహకరించాలని పోలీస్, రవాణాశాఖల అధికారులను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. దసరా ఆపరేషన్స్‌పై సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో పోలీస్, రవాణా శాఖల అధికారులతో ఆర్టీసీ సమన్వయ సమావేశం జరిగింది. ఇందులో సజ్జనార్ మాట్లాడుతూ.. సద్దుల బతుకమ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 6,304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నదని వివరించారు. మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో గతేడాది కంటే ఈ సారి రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అదనంగా 600 స్పెషల్ సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లు చెప్పారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బొరబండ, శంషాబాద్‌లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు తదితర ప్రాంతాలకు బస్సులను నడిపేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు. జేబీఎస్ నుంచి 1602, ఎల్బీనగర్ నుంచి 1193, ఉప్పల్ నుంచి 585, ఆరాంఘర్ నుంచి 451 అదనపు బస్సులను నడుపుతున్నట్లు సజ్జనార్ వివరించారు.
తిరుగు ప్రయాణం రద్దీ ఎక్కువగా ఉండే ఈ నెల 13, 14వ తేదీల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.in లో చేసుకోవాలని ఆయన కోరారు. హైదరాబాద్ సిటీ అదనపు కమిషనర్ (ట్రాఫిక్) విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. పండుగ వేళల్లో టీజీఎస్ఆర్టీసీకి తమ సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు. సమావేశంలో సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే, అశోక్ కుమార్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీలు శ్రీనివాసులు, మనోహర్, ట్రాఫిక్ అదనపు డీసీపీలు వీరన్న, ఎండీ మాజిద్, రవాణా శాఖలకు చెందిన ఆర్టీఏలు వాణి, పురుషోత్తం రెడ్డి, సుభాశ్ రెడ్డి , టీజీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.