
- త్వరలో అర్ధరాత్రి బస్సులను ఆపెయ్యాలని ఆర్టీసీ ఆలోచన
- ప్రయాణికులు లేకపోవడంతో నిలిపివేయడానికే మొగ్గు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ లో అర్ధరాత్రి కూడా బస్సు సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ‘నైట్ రైడర్’ సర్వీసులను అధికారులు త్వరలో నిలిపివేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే 50 శాతం సర్వీసులను తగ్గించిన ఆర్టీసీ.. త్వరలో పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ అత్యవసర పనులపై వెళ్లేవారి కోసం ఆర్టీసీ మూడేండ్ల కింద నైట్ రైడర్స్ పేరుతో బస్ సర్వీసులను ప్రవేశపెట్టింది. నగరంలోని కొన్ని కీలక ప్రాంతాలకు రాత్రి 10.30 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు బస్సులను నడుపుతోంది.
ఈ స్పెషల్సర్వీసులో అసలు చార్జీకి 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. సికింద్రాబాద్– పటాన్చెరు, సికింద్రాబాద్– చార్మినార్, ఉప్పల్– కొండాపూర్, ఈసీఐఎల్– మెహిదీపట్నం, సికింద్రాబాద్– సీబీఎస్, అఫ్జల్‌గంజ్– చాంద్రాయణగుట్ట, చార్మినార్– దిల్సుఖ్నగర్రూట్లలోని ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఈ నైట్‌రైడర్ సర్వీసులను తిప్పుతోంది. అర్ధరాత్రి క్యాబ్‌లు, ఆటోల్లో కంటే నైట్రైడర్సర్వీసుల్లో తక్కువ చార్జీలు పెట్టామని ఉంటాయని, సక్సెస్అవుతామని ఆర్టీసీ అధికారులు భావించారు. ఒక్కో రూట్లో రెండు బస్సులతో 50 బస్సులను అందుబాటులో ఉంచారు.
కారణాలెన్నో..
గ్రేటర్‌పరిధిలో మూడేండ్లుగా నైట్ రైడర్సర్వీసులను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఈ సర్వీసుల్లో వారికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాల్సి వచ్చింది. దీంతో, ఆదాయానికి కొంత గండిపడుతోంది. అలాగే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నైట్రైడర్సర్వీసులు నడుస్తాయని చాలా మందికి తెలియకపోవడంతో ఎక్కువ మంది ఊబర్, ఓలా, ర్యాపిడోలనే ఆశ్రయిస్తున్నారు.
ఆర్టీసీ ప్రచారం కల్పించకపోవడంతో తక్కువ సంఖ్యలో ప్రయాణికులు నైట్రైడర్సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఈ సర్వీసుల వల్ల సంస్థకు పెద్దగా ఆదాయం రావడం లేదు. ఇటీవల ఈ సర్వీసులను సగానికి తగ్గించినట్టు అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే కొద్ది రోజుల్లోనే నైట్ రైడర్ సర్వీసులను పూర్తిగా నిలిపివేసే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్టు తెలుస్తోంది. నైట్సర్వీసుల్లో భాగంగా వజ్ర పేరుతో మినీ బస్సులను నడిపిన ఆర్టీసీ ఇప్పటికే వాటిని పూర్తిగా నిలిపివేసింది.