- 7 రీజియన్లలో , ఒక నాన్ ఆపరేటింగ్ యూనిట్‌లో టీడబ్ల్యూయూ విజయం
- ఒక రీజియన్‌లో ఎస్‌డబ్ల్యూఎఫ్ గెలుపు
- 17న ఫలితాలను ప్రకటించనున్న కార్మిక శాఖ
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో సీపీఐ అనుబంధ ఆర్టీసీ కార్మిక సంఘం ఈయూ కూటమి హవా కొనసాగింది. రీజియన్ స్థాయిలో టీడబ్ల్యూయూ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించినట్టు తెలుస్తున్నది. మొత్తం 11 రీజియన్లు, 3 నాన్ ఆపరేటింగ్ యూనిట్లు ఉండగా, అందులో 7 రీజియన్లలో, ఒక నాన్ ఆపరేటింగ్ యూనిట్‌లో టీడబ్ల్యూయూ వైపు ఓటర్లు మొగ్గు చూపినట్టు సమాచారం. మరో రీజియన్‌లో టీడబ్ల్యూయూ కూటమిలోని ఎస్‌డబ్ల్యూఎఫ్ సత్తా చాటినట్టు తెలుస్తున్నది. మెజార్టీ రీజియన్లను టీడబ్ల్యూయూ కూటమి చేజిక్కించుకోగా, రెండు, మూడు చోట్ల ఈయూ ఆధిక్యతను ప్రదర్శించినట్టు సమాచారం.
మొత్తానికి శుక్రవారం నిర్వహించిన ఆర్టీసీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో ఎర్రజెండా రెపరెపలాడింది. జిల్లాల్లో టీడబ్ల్యూయూ పట్టు సాధించింది. అత్యధిక ఓట్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలో ఏ కూటమికి ఆధిక్యత రాలేదని తెలుస్తున్నది. రాష్ట్రస్థాయిలో ఏ కూటమికి గుర్తింపు లభిస్తుందో..51 శాతం ఓట్లు సాధించని రీజియన్లు కూడా అదే కూటమి ఖాతాలో చేరుతాయి. ఈ లెక్కన ఈ 2 రీజియన్లు ఈయూ కూటమిలోకి వెళ్లే అవకాశం ఉన్నది. సీపీఐ అనుబంధ ఆర్టీసీ కార్మిక సంఘం ఈయూ కూటమిలో ఎన్ఎంయూ, టీఎంయూ ఉండగా.. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన టీడబ్ల్యూయూ కూటమిలో ఎస్‌డబ్ల్యూఎఫ్,ఎస్‌డబ్ల్యూయూ, బీకేయూ ఉన్నాయి.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
రాష్ట్రంలో పదేండ్ల తర్వాత ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఆర్టీసీ కార్మికులు ఆసక్తి చూపారు. ఉదయం వేళ మందకొడిగా పోలింగ్ జరగ్గా.. మధ్యాహ్నం నుంచి క్రమేపీ ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 98 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రాష్ట్రంలోని మొత్తం 115 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్‌లో 34, 905 మంది ఓటర్లకుగానూ.. 34 ,182 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పూర్తి ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలు, వర్క్ షాపులు, బాడీ యూనిట్‌లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.. సాధ్యమైనంత మేర ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. దూర ప్రాంత డ్యూటీలకు వెళ్లిన కండక్టర్లు, డ్రైవర్ల కోసం ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 17న ఇటు రాష్ట్ర స్థాయిలో.. అటు రీజియన్లవారీగా కార్మిక శాఖ అధికారులు ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
