- లైఫ్ జాకెట్ ఉంటేనే ఎంట్రీ.. ఓవర్ లోడింగ్‌కు నో చాన్స్
- బోటింగ్ యూనిట్ మేనేజర్లకు టీజీటీడీసీ ఎండీ గౌతమి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో బోటింగ్ చేసే పర్యాటకుల భద్రత విషయంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో నీటిపై ప్రయాణించే పడవలు (వాటర్ ఫ్లీట్) ఆపరేషన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠినమైన భద్రతా నిబంధనలను అమలు చేయాలని ఎండీ గౌతమి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్రంలోని అన్ని బోటింగ్ యూనిట్ మేనేజర్లు, ఇన్‌చార్జ్‌లకు గైడ్‌లైన్స్ పంపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోటింగ్ యూనిట్ మేనేజర్లు కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా, రద్దీగా ఉండే వారాంతాల్లో, సెలవు రోజుల్లో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రతిరోజూ బోట్లు నీటిలోకి వెళ్లేముందు ఇంజిన్ కండిషన్, ఫ్యూయల్ లెవల్స్, ఎమర్జెన్సీ ఎక్విప్‌మెంట్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ వంటి అంశాలను ‘డైలీ చెక్ లిస్ట్’ ద్వారా తనిఖీ చేయాలని సూచించారు.
పర్యాటకుల భద్రత విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరించాలన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి పర్యాటకుడు లైఫ్ జాకెట్ ధరిస్తేనే బోటులోకి అనుమతించాలని ఆదేశించారు. బోటు సామర్థ్యం కంటే ఒక్క పర్యాటకుడు ఎక్కువ ఉన్నా పంపించకూడదని, గాలి వేగం ఎక్కువగా ఉన్నా, భారీ వర్షం పడినా, వెలుతురు తక్కువగా ఉన్నా వెంటనే బోటింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని సూచించారు.
