మునిగిన థాయ్​ యుద్ధనౌక, 31 మంది గల్లంతు

మునిగిన థాయ్​ యుద్ధనౌక, 31 మంది గల్లంతు
  • బలమైన ఈదురు గాలులే కారణం
  • కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 

బ్యాంకాక్: గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో యుద్ధనౌక ప్రమాదవశాత్తు నీట మునిగింది. ఈ ప్రమాదంలో 31 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం నౌకలు, హెలికాప్టర్‌ల సహకారంతో థాయ్‌లాండ్ సైన్యం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. మునిగిన నేవీ షిప్ పేరు హెచ్ టీఎంఎస్ సుఖోథాయ్ అని అధికారులు తెలిపారు. ఆదివారం థాయ్‌లాండ్‌ ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్‌లో సముద్ర తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో  నౌక, గస్తీ డ్యూటీలో పాల్గొన్నదని చెప్పారు. 

బలమైన ఈదురు గాలుల  వల్ల సముద్రపు నీరు నౌకలోకి చేరిందన్నారు. దీంతో పవర్ రూమ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంట్ పోయిందని అధికారులు తెలిపారు. కరెంట్ లేకపోవడంతో నౌక ఇంజన్ ఆగిందని.. దాంతో నౌక నీట మునిగిందని వివరించారు. ప్రమాదం జరిగిన టైంలో నౌకలో 106 మంది సిబ్బంది ఉన్నారని.. 75 మందిని కాపాడామని చెప్పారు. మిగతా 31 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో రెస్క్యూకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని..  కానీ సిబ్బందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను థాయ్ నేవీ, తన ట్విట్టర్  అకౌంట్ లో పోస్ట్ చేసింది. అమెరికా నిర్మించిన సుఖోథాయ్ 1987 నుంచి వాడుకలో ఉందని పేర్కొంది.