Vijay :కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ ముందుకు విజయ్.. తమిళ రాజకీయాల్లో టెన్షన్.. టెన్షన్!

Vijay :కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ ముందుకు విజయ్.. తమిళ రాజకీయాల్లో టెన్షన్.. టెన్షన్!

తమిళ రాజకీయాల్లో ప్రకంపంనలు సృష్టించిన కరూర్ తొక్కిసలాట కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, దళపతి విజయ్ సోమవారం ( జనవరి 12, 2026 ) ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ ఇప్పుడు అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు సినీ పరిశ్రమలో ఉత్కంఠను రేపుతోంది.

ఢిల్లీలో హైడ్రామా..

సోమవారం ఉదయం 11:29 గంటలకు విజయ్ ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఈ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) సీబీఐ కార్యాలయం చుట్టూ ఇనుప కంచెలు వేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అభిమానులు భారీగా తరలివచ్చి నిరసనలు తెలిపే అవకాశం ఉండటంతో 144 సెక్షన్ తరహా వాతావరణం కనిపించింది. అయినప్పటికీ, కొందరు అభిమానులు మీడియా ప్రతినిధుల మధ్య నుంచి లోపలికి చొచ్చుకువచ్చి తమ అభిమాన నటుడిని చూసేందుకు ప్రయత్నించారు.

అసలేం జరిగింది?

సెప్టెంబర్ 27, 2025న తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీకే పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సమయంలో ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై తొలుత రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ.. నిష్పాక్షిక విచారణ జరగాలంటూ సుప్రీంకోర్టు ఈ కేసును అక్టోబర్ 2025లో సిబిఐకి అప్పగించింది.

సిబిఐ ప్రశ్నల వర్షం..

సిబిఐలోని యాంటీ కరప్షన్ యూనిట్ అధికారులు విజయ్‌ను విచారిస్తున్నారు. ప్రధానంగా  నాడు నిర్వహించిన సభకు ఎంతమంది వస్తారని అంచనా వేశారు? దానికి తగ్గట్టుగా వాలంటీర్లను ఏర్పాటు చేశారా?  తొక్కిసలాట జరిగిన సమయంలో పార్టీ నాయకత్వం తీసుకున్న చర్యలేంటి? ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా లేదా కేవలం నిర్వహణ లోపమా? అన్న అంశాలపై ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని, సాక్షిగా తన వాంగ్మూలాన్ని నమోదు చేస్తానని విజయ్ ఇప్పటికే ప్రకటించారు.

సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తొక్కిసలాట దేశ ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిన ఈ కేసులో విచారణ పారదర్శకంగా ఉండాలి అని జస్టిస్ జె.కె. మహేశ్వరి నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. పోలీసు అధికారులు బాధ్యతారాహిత్యంగా మీడియాకు స్టేట్‌మెంట్లు ఇవ్వడాన్ని కూడా కోర్టు తప్పుపట్టింది.

తమిళనాడులో బలమైన రాజకీయ శక్తిగా  విజయ్ ఎదుగుతున్న తరుణంలో ఈ కేసు సిబిఐ విచారణకు వెళ్లడం  హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే భద్రత కల్పించడంలో విఫలమైందని టీవీకే ఆరోపిస్తుండగా,.. సిబిఐ నివేదిక బయటకు వస్తేనే అసలు నిజాలు తెలిసే అవకాశం ఉందని అధికార పక్షం ఆరోపిస్తోంది. దళపతి విజయ్ చుట్టూ తిరుగుతున్న ఈ పరిణామాలు తమిళ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.