విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ చుట్టూ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. తెలుగులో దీనిని ‘జన నాయకుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ విడుదలైనప్పటి నుండి అటు వివాదాలు, ఇటు పోలికల గోల ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్‌లో ఒక చిన్న ‘AI వాటర్‌మార్క్’ కనిపించడం పెను దుమారానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ‘జన నాయకుడు’ సినిమాపై సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్స్ తో పాటు విమర్శలను మూటకట్టుకుంటుంది.
ట్రైలర్‌లో ‘గూగుల్ జెమిని’ లోగో.. ఎడిటింగ్ తప్పిదమా?
శనివారం విడుదలైన ఈ ట్రైలర్‌లో విజయ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, పగ తీర్చుకునే వీరుడిగా కనిపించారు. అయితే, ట్రైలర్ మధ్యలో షాట్‌గన్‌ను లోడ్ చేసే ఒక సన్నివేశం తర్వాత, స్క్రీన్ మూలలో చాలా స్వల్పంగా ‘Google Gemini’ లోగో కనిపించింది. దీనిని పసిగట్టిన నెటిజన్లు స్క్రీన్ రికార్డింగ్‌లతో సహా ఎక్స్ లో రచ్చ మొదలుపెట్టారు. దాదాపు రూ400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమాలో ఇంత చిన్న పొరపాటు జరగడంపై ట్రోల్స్ వర్షం కురుస్తోంది. "ఒక స్టార్ హీరో చివరి సినిమాలో ఇలాంటి రూకీ మిస్టేక్ ఏంటి?" అని కొందరు, "సినిమా కళకు AI వాడకం అవమానం" అని మరికొందరు మండిపడుతున్నారు. ఆదివారం ఉదయానికల్లా చిత్ర బృందం ఆ పొరపాటును సరిదిద్ది, లోగో లేని వెర్షన్‌ను అప్‌లోడ్ చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
They used AI Gemini shot and didn't bother to remove the watermark 😭#JanaNayagan pic.twitter.com/voi66tbLg0
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) January 3, 2026
‘భగవంత్ కేసరి’తో పోలికలు: రీమేక్ ఆ? కాపీనా?
ట్రైలర్ విడుదలైనప్పటి నుండి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘భగవంత్ కేసరి’ ఛాయలు ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. తండ్రి-కూతురు సెంటిమెంట్ తో పాటు చాలా వరకు ఈ సినిమాను కాపీ చేశారని ట్రోల్స్ నడుస్తున్నాయి. భగవంత్ కేసరిలో శ్రీలీల పాత్రను బాలయ్య ఒక వీరనారిలా ఎలా తీర్చిదిద్దుతారో, ఇందులోనూ ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు పాత్రను విజయ్ అలాగే ఆర్మీ వైపు నడిపిస్తారని తెలుస్తోంది. మొదట భయస్తురాలిగా ఉండి, హీరో శిక్షణలో ఆర్మీలో చేరే అమ్మాయి కథాంశం రెండు సినిమాల్లోనూ సమానంగా ఉన్నాయంటున్నారు. విజయ్ ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రాజకీయ అరంగేట్రం వేళ.. ఒకే ఒక్కడు!
విజయ్ తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) స్థాపించిన తర్వాత నటిస్తున్న చివరి సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. 2026 ఎన్నికల బరిలో దిగబోతున్న విజయ్, ఈ సినిమా ద్వారా తన రాజకీయ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి "ప్రజాస్వామ్య జ్యోతి" అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అదరగొట్టారు. సంక్రాంతి కానుకగా ‘జన నాయగన్’ జనవరి 9, 2026న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. మరి ఈ AI వివాదాన్ని, ‘భగవంత్ కేసరి’ పోలికలను దాటుకుని ‘జన నాయకుడు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
