
- ప్రతి 100 మందిలో ఐదుగురు క్యారియర్సే..
- ఇద్దరు క్యారియర్స్ పెండ్లి చేసుకుంటే సంతానానికి వ్యాధి వచ్చే చాన్స్
- పెండ్లికి ముందే హెచ్‌బీ ఏ2 టెస్ట్ చేయించుకోవాలంటున్న డాక్టర్స్
- ఇయ్యాల తలసేమియా డే
మంచిర్యాల, వెలుగు : తలసేమియా, సికిల్ సెల్... వంటి ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు, వాహకులు రాష్ట్రంలో పెరిగిపోతున్నారు. జనాభాలోని ప్రతి వంద మందిలో ఐదుగురు తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి వాహకులే (క్యారియర్స్) ఉంటున్నారు. వ్యాధి వాహకులైన యువతి, యువకుడు పెండ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలకు కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వ్యాధి సోకిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా టెస్ట్‌లు చేసుకోవడం మేలని పలువురు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
రాష్ట్రంలో 10 వేల మంది బాధితులు
రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి సరిగా జరకపోవడం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారిలో రక్తహీనత, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందించాలి. లేకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. తలసేమియా, సికిల్ సెల్ బాధితులు తెలంగాణలో 10 వేల మంది వరకు ఉంటారని అంచనా. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే 2 వేల మందికి పైగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారు.
తలసేమియా వ్యాధి సోకిన వారికి నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. సికిల్ సెల్ బాధితులకు అవసరాన్ని బట్టి మూడు, నాలుగు నెలలకోసారి రక్తం అవసరం ఉంటుంది. రక్తం అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధిగ్రస్తులు ఏటేటా పెరుగుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఈ వ్యాధికి సంబంధించిన టెస్టులను ప్రభుత్వమే చేస్తోంది.
పెండ్లికి ముందే టెస్టులు
తలసేమియా క్యారియర్స్‌గా ఉన్న యువతీయువకులు పెండ్లి చేసుకుంటే వారికి పుట్టే పిల్లల్లో వ్యాధికారకులతో పాటు వ్యాధిగ్రస్తులు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదం లేకుండా యువతీయువకులు పెండ్లికి ముందే హెచ్‌బీ ఏ2 బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఇద్దరిలో ఒక్కరికే పాజిటివ్ వస్తే పుట్టబోయే సంతానానికి ఈ వ్యాధి వచ్చే చాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. తలసేమియా క్యారియర్స్‌ను గుర్తించేందుకు ఆశావర్కర్లు ఇల్లిల్లూ తిరిగి 40 ఏండ్ల వయస్సు ఉన్న వారందరికీ టెస్ట్‌లు చేస్తున్నారు.
ట్రీట్‌మెంట్‌కు లక్షల్లో ఖర్చు
తలసేమియాకు పూర్తిస్థాయి ట్రీట్‌మెంట్ తీసుకోవాలంటే ఎముక మజ్జ మార్పిడి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆపరేషన్ జరిగినా సక్సెస్ రేటు తక్కువగానే ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. తలసేమియా, సికిల్ సెల్ బాధితులకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో ఫ్రీగా రక్తం ఎక్కిస్తున్నారు. మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌లోని రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్‌లో 832 మంది తలసేమియా బాధితులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో ప్రతినెల 250 మందికి ఫ్రీగా రక్తం ఎక్కిస్తున్నారు.
సదరం సర్టిఫికెట్స్ రాలే...
తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి సదరం సర్టిఫికెట్స్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో దివ్యాంగుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో 2121 రకాల వైకల్యాలను కేంద్రం గుర్తించింది. ఈ మేరకు అప్పటి బీఆర్‌ఎస్ గవర్నమెంట్ 2018లో జీవో నంబర్ 5 రిలీజ్ చేసింది. కానీ తలసేమియా బాధితులకు సదరం సర్టిఫికెట్స్ మాత్రం ఇవ్వలేదు. తలసేమియా బాధితులకు యూడీఐడీ కార్డులు జారీ చేయాలని ఇటీవలే సెంట్రల్ గర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది.
ఈ మేరకు బాధితులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని సర్టిఫికెట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ ఇంకా రెడీ కాలేదని అధికారులు చెబుతున్నారు. వీరికి వైకల్యం సరిఫికెట్స్ ఇచ్చినట్లయితే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అంది, ఆర్థికభారం కొంత మేర తగ్గనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం
తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వాలు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో అవేర్‌నెస్ పెంచుతున్నాయి. ఈ నెల 6 నుంచి 12 వరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సదస్సులు నిర్వహిస్తున్నాం. అలాగే మంచిర్యాల జీజీహెచ్‌లో ప్రతినెల నాలుగో గురువారం టెస్ట్‌లు నిర్వహించి ఫ్రీగా మెడిసిన్ అందజేస్తున్నాం.
- కాసర్ల శ్రీనివాస్, తలసేమియా, సికిల్‌సెల్ ట్రాన్స్‌మిషన్ సెంటర్ ఇన్‌చార్జి.