Akhanda 3: బాలకృష్ణ 'అఖండ 2' రిలీజ్‍కు ముందే 'జై అఖండ' ప్రకటన.. హింట్ ఇస్తూ తమన్ పోస్ట్.. వైరల్!

Akhanda 3: బాలకృష్ణ 'అఖండ 2' రిలీజ్‍కు ముందే 'జై అఖండ' ప్రకటన.. హింట్ ఇస్తూ తమన్ పోస్ట్.. వైరల్!

నందమూరి బాలకృష్ణ,  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అభిమానులకు ఒక పండగ లాంటిదే. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' వంటి మూడు బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి వస్తున్న నాలుగో చిత్రం 'అఖండ 2 : తాండవం'. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 3D రూపంలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.  థియేటర్ల వద్ద అప్పుడే అభిమానుల హంగామా మొదలైంది. అటు  ఏపీలో ప్రీమియర్‌ టికెట్ల టికెట్లు అన్ని సెల్ అయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 

 ప్రీమియర్‌ టికెట్ల హంగామా!

'అఖండ 2'కి అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలకు మించి దూసుకుపోతున్నాయి. ప్రీమియర్ షోల కోసం టికెట్లు క్షణాల్లో అమ్ముడైపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీమియర్ టికెట్ల ధరను రూ.600 వరకు పెంచేందుకు అనుమతి ఇవ్వడంతో, ఆంధ్రా ప్రాంతంలో 'అఖండ 2' ప్రదర్శనలకు అఖండమైన స్పందన లభించింది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తొలిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేవలం 222 షోల ద్వారా 32,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. వీటిలో 120 షోలు 'ఫుల్' అయ్యాయి. ఒక్క అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా రూ1.87 కోట్ల వసూళ్లు సాధించింది. దీనిని బట్టే సినిమాపై ప్రేక్షకులకు ఎంతటి నమ్మకం ఉందో అర్థమవుతోంది. విదేశాల్లో కూడా బుకింగ్స్ అదే స్థాయిలో ఉన్నాయి. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే 2,10,000 డాలర్ల మార్కును దాటాయి. పెరిగిన డిమాండ్ దృష్ట్యా, ప్రపంచవ్యాప్తంగా అదనపు షోలను ఏర్పాటు చేస్తున్నారు.

 

 'అఖండ 3' టైటిల్ లీక్..
'అఖండ 2' విడుదల కాకముందే, దీని తదుపరి అఖండ సీక్వెల్ గురించి సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ (S.S. Thaman), 'అఖండ' సిరీస్ ఐదు భాగాలుగా వచ్చే అవకాశం ఉందని చెప్పడం ఈ చర్చకు మరింత బలాన్నిచ్చింది. లేటెస్ట్ గా తమన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో తమన్, బోయపాటి శ్రీను, చిత్ర బృందం ఉన్నారు. అయితే, వారి వెనుక ఉన్న డిజిటల్ స్క్రీన్‌పై పెద్ద అక్షరాల్లో “JAI AKHANDA” అని రాసి ఉంది. 'అఖండ 2' పనులు పూర్తయ్యాయని ప్రకటిస్తూ తమన్ పంచుకున్న ఈ ఫోటో, అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. వెంటనే ఈ స్క్రీన్‌షాట్‌ను వైరల్ చేస్తూ, బాలయ్య అభిమానులు 'అఖండ 3' టైటిల్ 'జై అఖండ' అని ఖరారు చేసుకున్నారు.

 

'అఖండ 2' క్లైమాక్స్‌లో చిత్ర బృందం మూడో భాగం 'జై అఖండ' గురించి అధికారికంగా హింట్ ఇచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో 'పుష్ప 2' సమయంలో కూడా ఇదే విధంగా మూడో భాగం గురించి పరోక్షంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏదేమైనా, ఈ లీక్ వార్త 'అఖండ' యూనివర్స్ విస్తరణపై ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. బాలయ్య మరింత రౌద్రంగా, మరింత ఆధ్యాత్మికంగా కనిపించనున్న 'అఖండ 2' డిసెంబర్ 5న బాక్సాఫీస్‌పై ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి.