
యానిమల్, ఛావా లాంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్‌లో దూసుకెళ్తున్న రష్మిక మందన్న.. త్వరలో ‘థామా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్య సర్పోత్ధార్ దర్శకత్వం వహించాడు. మాడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రం కావడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ప్రమోషన్స్ భాగంగా ఇటీవల విడుదల చేసిన ‘నువ్వు నా సొంతమా..’ అనే పాటకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రష్మిక డ్యాన్స్ మూమెంట్స్ ఇంప్రెస్ చేశాయి. ఈ పాట విషయంలో తెరవెనుక జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది రష్మిక.
‘‘టాకీ పార్ట్‌కు సంబంధించి పన్నెండు రోజుల పాటు ఓ స్టన్నింగ్ లొకేషన్‌లో షూటింగ్ చేశాం. షూట్ చివరిరోజున మేకర్స్‌కు ఓ ఆలోచన వచ్చింది. ఆ క్రేజీ లొకేషన్‌లో ఓ పాట తీస్తే బాగుంటుందనే వారి ఆలోచన టీమ్ అందరికీ నచ్చడంతో వెంటనే పని మొదలుపెట్టాం. కేవలం మూడు, నాలుగు రోజుల్లో పాటను పూర్తి చేశాం. ఎలాంటి ప్లానింగ్ లేకుండా అనుకోకుండా తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ అవుట్‌పుట్ చూశాక ఆశ్చర్యపోయాం. ప్రేక్షకులు ఈ పాటను ప్రేమిస్తారు.. సినిమా చూస్తూ మాతో కలిసి థియేటర్స్‌లో డ్యాన్స్ చేస్తారు’ అని చెప్పింది. అక్టోబర్ 21న ఈ సినిమా జనం ముందుకొస్తోంది.