నేడు (నవంబర్ 11) తమ్మిడికుంట చెరువు ప్రారంభం..రూ.20 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దిన హైడ్రా    

నేడు (నవంబర్ 11) తమ్మిడికుంట చెరువు ప్రారంభం..రూ.20 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దిన హైడ్రా    
  • 14 ఎకరాల నుంచి 30 ఎకరాలకు విస్తరించిన వైనం
  • ప్రారంభించనున్న సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. 14 ఎకరాలకు కుంచించుకుపోయిన చెరువును ఆక్రమణల తొలగింపుతో తిరిగి దాదాపు 30 ఎకరాల విస్తీర్ణానికి తీసుకొచ్చారు. ఈ చెరువు పునరుద్ధరణతో నగరానికి మరో పర్యావరణ కానుక అందుబాటులోకి రానుంది. హైడ్రా చేపట్టిన తొలి విడతలోని ఆరు చెరువుల్లో తమ్మిడికుంట ఒకటి. ఎన్-కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌తోపాటు ఇతర ఆక్రమణలను తొలగించి చెరువు భూములను స్వాధీనం చేసుకున్నారు.

15 అడుగుల వరకు పేరుకుపోయిన మట్టి, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. గతంలో నేరుగా చెరువులో కలుస్తున్న మురుగునీటిని మళ్లించేందుకు 1,200 మిల్లీమీటర్ల పైపులైన్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. మూడు ఇన్‌‌‌‌‌‌‌‌లెట్లు, ఒక ఔట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌ను పునరుద్ధరించి వర్షపు నీరు చెరువులోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో శిల్పారామం పరిసరాల్లో తరచూ ఎదురయ్యే వరద ముంపు సమస్య తగ్గే అవకాశం ఏర్పడింది. రూ.20 కోట్లతో ఈ చెరువును సుందరీకరించారు.

1.25 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, యోగా వేదిక, రోజ్ గార్డెన్, బెంచీలు, పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్, ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్ పరిధిలో ప్రహరీ నిర్మించారు. గతంలో దుర్వాసన, దోమలతో ఇబ్బందులు ఎదుర్కొన్న స్థానికులకు ఇప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి రానుంది.