బ్రిడ్జి కనిపించింది.. 50 ఏండ్ల తర్వాత!

బ్రిడ్జి కనిపించింది.. 50 ఏండ్ల తర్వాత!

యాభై ఏండ్ల కిందట తుఫాన్ బీభత్సానికి సముద్రంలో కలిసిపోయిన రోడ్డు బ్రిడ్జి బయటపడింది. తమిళనాడులోని రామేశ్వరం ద్వీపానికి సౌత్‌వెస్ట్‌ వైపున ఉన్న ధనుష్కోటి గ్రామం 1914 నుంచి మంచి టూరిస్టు స్పాట్ గా పేరుపొందింది. టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండటంతో వాణిజ్య కేంద్రంగానూ ఎదిగింది. బ్రిటిష్ వాళ్లు కూడా ఇక్కడినుంచే  శ్రీలంకలోని తలైమన్నార్​కు సరుకు రవాణా చేసేవారు. దీంతో ఈ గ్రామాన్ని రామేశ్వరాన్ని కలుపుతూ 20 అడుగుల వెడల్పు, 80 అడుగుల పొడవైన హైవే బ్రిడ్జిని నిర్మించారు. సిమెంటు పిల్లర్లు వేసి రక్షణ గోడతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్లపాటు ఈ బ్రిడ్జి సేవలందించింది. 1964లో సముద్రంలో భారీ తుఫాను కారణంగా తీరప్రాంతం ఉప్పొంగి బ్రిడ్జి సముద్రంలో కలిసిపోయింది. కొన్నేళ్లుగా తీవ్ర గాలులు, అలల తాకిడికి ఒడ్డున ఉన్న ఇసుక మేట కోతకు గురై బ్రిడ్జి మళ్లీ బయటపడింది. ఇన్నేళ్ల తర్వాత బయటపడ్డ బ్రిడ్జిని చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. దీని అవశేషాలను భద్రపరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.