అందుకే మనకు గుండె జబ్బులు!

అందుకే మనకు గుండె జబ్బులు!

ఒకప్పుడు మందు, సిగరెట్​లు తాగేటోళ్లకు, మాంసం బాగా తినేటోళ్లకు గుండెజబ్బులు వస్తుండేవి. కారణం, గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే ఆర్టరీల్లో (సిరలు) కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వస్తుంది. దాన్నే అథెరోస్క్లీరోసిస్​ అంటారు. కానీ, ఈ మధ్య కాలంలో వయసు, తిండి, ఇతర అలవాట్లతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి. దానికి కారణం అలవాట్లు కాదా? అంటే, ఓ రకంగా అదే కరెక్ట్​ అని అంటున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా శాన్​ డయీగో స్కూల్​ ఆఫ్​ మెడిసిన్​ సైంటిస్టులు. 30 లక్షల ఏళ్ల క్రితం మన పూర్వీకుల్లో ఓ జీన్​లో మార్పులు జరగడం వల్లే గుండె జబ్బులు వస్తున్నట్టు చెబుతున్నారు. ఎలుకలపై చేసిన పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని తేల్చారు. ఇండియాకు చెందిన డాక్టర్​ అజిత్​ వర్కి ఈ స్టడీకి నేతృత్వం వహించారు. మన పూర్వీకుల్లో సీఎంఏహెచ్​ అనే జీన్​ ఉండేదని, అది న్యూ5జీసీ అనే ఓ మాలిక్యూల్​(సియాలిక్​ యాసిడ్​)ను విడుదల చేసేదని భావిస్తున్నారు.

మలేరియా కారణంగా అప్పటి మానవుల్లో ఆ జీన్​లో మార్పులొచ్చి సియాలిక్​ యాసిడ్​ లోపించి ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు ఎలుకల్లోనూ ఆ జీన్​లో మార్పులు చేసి సియాలిక్​ యాసిడ్​ పోయేలా చేశారు. దాని వల్ల ఎలుకల్లో రెండు రెట్లు ఎక్కువగా గుండెజబ్బు ముప్పులు వచ్చాయని నిర్ధారించారు. కాబట్టి మనిషిలో ఆ జీన్​లో జరిగిన మార్పుల వల్లే గుండె జబ్బులు వస్తుండొచ్చని చెప్పారు. దానికితోడు జంతు మాంసాన్ని తింటే ఆ ముప్పు ఇంకా ఎక్కువ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానికీ కారణాలున్నాయని అజిత్​ చెప్పారు. రోగనిరోధక వ్యవస్థ తెల్ల రక్తకణాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల వాపు పెరిగి, సిరల గోడలకు అతుక్కున్న కొవ్వు క్లియర్​ కావట్లేదని గుర్తించారు. సహజంగా కాకుండా ఆహారంలో న్యూ5జీసీని సప్లిమెంట్​లా తీసుకుంటే ముప్పు ఇంకా ఎక్కువ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదని తేల్చారు.

ఆస్పిరిన్​తో చేటే

గుండె రోగులకు ఆస్పిరిన్​ మందును ఇస్తుంటారు. అది రక్తాన్ని పలుచన చేసి, ప్రసరణను పెంచుతుంది. కానీ, ఆ మందుతో చేటే అంటున్నారు సైంటిస్టులు. అప్పట్లోనూ దీనిపై వాదనలు నడిచినా కొందరు డాక్టర్లు కొట్టిపారేశారు. తాజాగా మళ్లీ దానిపై స్టడీ చేసి ఈ విషయాన్ని తేల్చారు. అమెరికాలోని హార్వర్డ్​ యూనివర్సిటీకి చెందిన బెథ్​ ఇజ్రాయెట్​ డీకోనెస్​ మెడికల్​ సెంటర్​ సైంటిస్టులు స్టడీ చేసి ఈ విషయాన్ని నిర్ధారించారు. 2017లో సీడీసీ చేసిన నేషనల్​ హెల్త్​ ఇంటర్వ్యూ సర్వేని పరిశీలించి చెప్పారు. చాలా మంది ఎలాంటి గుండెజబ్బులు లేకున్నా అవి రావొద్దన్న కారణంతో ఆస్పిరిన్​ను తీసుకుంటున్నారని గుర్తించారు. దాని వల్ల భవిష్యత్తులో బ్లీడింగ్​, జీర్ణకోశ సమస్యలు వస్తాయని హెచ్చరించారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.