
‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్.కె.సాగర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడు. రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌ను చిరంజీవి తల్లి కొణిదెల అంజనా దేవి లాంచ్ చేశారు. నేరాలను నిర్మూలించడానికి ఎంతకైనా తెగించే నిజాయితీ గల ఐపీఎస్ అధికారి పాత్రలో ఆర్.కె.సాగర్ కనిపించాడు. హ్యూమన్ రైట్స్ కమిషన్ విచారణను ఎదుర్కొంటున్న హీరో.. ‘నేను ఏం చెప్పినా మీరు నమ్మరు, మీరు ఎక్స్‌పెక్ట్ చేసేది నేను చెప్పను..’ అని బదులిస్తాడు. రౌడీ షీటర్ల సామూహిక హత్యల నేపథ్యంలో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. ‘గెలవడమే గోల్ అయినప్పుడు, ఆట ఎలా ఆడితే ఏంటి’ అనే డైలాగ్ ఆకట్టుకుంది. మిషా నారంగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.