రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టడం అంటే ఒక కల. కానీ ఆ కలే కలవరంగా మారితే? ఇటీవల గురుగ్రామ్‌లో వెలుగుచూసిన 32nd అవెన్యూ భారీ మోసం చూస్తుంటే.. డాక్యుమెంట్లు ఉన్నా సరే ప్రాపర్టీ కొన్న వ్యక్తులు సేఫ్ కాదని అర్థమవుతోంది. కేవలం 3వేల చదరపు అడుగుల స్థలాన్ని ఏకంగా 25 మందికి పైగా అమ్మేసి.. దాదాపు రూ.500 కోట్ల మేర మోసం చేశారు. ఫిబ్రవరి 2026లో ఈ వ్యవహారం బయటపడటంతో ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు.
అసలు ఏం జరిగింది?
మోసగాళ్లు ఒకే యూనిట్‌ను వేర్వేరు వ్యక్తులకు విక్రయించి, నకిలీ అగ్రిమెంట్లతో అందరినీ నమ్మించారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా అని సంబరపడే లోపే.. అసలు కథ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ న్యాయ నిపుణులు చెప్పే షాకింగ్ నిజం ఏంటంటే.. రిజిస్ట్రేషన్ మాత్రమే యజమానిని నిర్ణయించదట. అందరికంటే ముందుగా ఎవరి పేరు మీద డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ అయిందో.. వారికే ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. సో మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ కొనాలని అనుకుంటున్నట్లయితే మోసగాళ్ల చేతిలో మునిగిపోక ముందే మేల్కొనాలని.. ఖచ్చితంగా ఈ 7 డాక్యుమెంట్లను పరిశీలించాలని అంటున్నారు న్యాయ నిపుణులు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు మోసపోకుండా ఉండాలంటే, కేవలం బ్రోకర్ చెప్పే మాటలు నమ్మకుండా ఈ 7 డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అస్సలు మర్చిపోకండి..
1. మదర్ డీడ్: ఇది ఆస్తికి సంబంధించిన జనన ధృవీకరణ పత్రం లాంటిది. అసలు ఆ స్థలం ఎవరిది? ఎక్కడి నుంచి మొదలైంది? అనే మూలాలను ఇది చెప్తుంది.
2. సేల్ డీడ్ చైన్: గతంలో ఆ ఆస్తి ఎవరెవరి చేతులు మారింది? పేర్లు, సర్వే నంబర్లు అన్ని పత్రాల్లో సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఒక్క లింక్ మిస్ అయినా డేంజరే.
3. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్: ఆస్తిపై ఏవైనా బ్యాంక్ లోన్లు, తనఖాలు లేదా కోర్టు కేసులు ఉన్నాయా అనేది దీని ద్వారా తెలుస్తుంది. కనీసం 30 ఏళ్ల హిస్టరీ చూడటం బెటర్.
4. మ్యుటేషన్ రికార్డ్స్: ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో ప్రస్తుత యజమాని పేరు ఉందో లేదో దీని ద్వారా తెలుస్తుంది. ఇది టైటిల్‌కు బలమైన సాక్ష్యం.
5. ప్రాపర్టీ టాక్స్ రిసీట్స్: పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నారా? యజమాని పేరు మీదనే బిల్లులు వస్తున్నాయా? అనేది సరిచూసుకోవాలి.
6. అప్రూవ్డ్ ప్లాన్ & OC: బిల్డింగ్ ప్లాన్ మున్సిపాలిటీ అనుమతి పొందిందా? ఆక్యుపెన్సీ సర్టిఫికేట్(OC) ఉందా? అనేది కమర్షియల్ ప్రాపర్టీలకు చాలా కీలకం.
7. రెరా రిజిస్ట్రేషన్: ప్రాజెక్ట్ వివరాలు రెరా పోర్టల్‌లో ఉన్నాయా లేదా చూడాలి. అక్కడ లేని ప్రాజెక్టు జోలికి వెళ్లకపోవడమే మంచిది.
డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నా.. ఒకసారి పబ్లిక్ నోటీసు ఇచ్చి ఎవరైనా అభ్యంతరాలు ఉన్నారా అని చెక్ చేసుకోవడం, లీగల్ ఒపీనియన్ తీసుకోవడం భవిష్యత్తులో చిక్కులు రాకుండా కాపాడుతుంది. లేదంటే కష్టపడి సంపాదించిన సొమ్ము గురుగ్రామ్ బాధితుల మాదిరి గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. బ్రోకర్లు ఏం చెప్పారనే మాటలపైనే ఆధారపడి నిర్ణయం తీసుకోకుండా పైన సూచించిన డాక్యుమెంట్లన్నీ పరిశీలించి, న్యాయనిపుణుల సలహా తీసుకుని ముందుకెళ్లటం మంచిది.
