ప్రభుత్వ భూమికి ఫేక్ పట్టాలిచ్చి డబ్బులు వసూలు

ప్రభుత్వ భూమికి ఫేక్ పట్టాలిచ్చి డబ్బులు వసూలు
  • మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ముగ్గురు అరెస్ట్ 

పాలమూరు, వెలుగు: ప్రభుత్వ భూమికి ఫేక్ పట్టాలు తయారు చేసి డబ్బులు వసూలు చేసిన నిందితులను మహబూబ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి ఆదర్శనగర్ సర్వే నంబర్ 523లోని ప్రభుత్వ భూమికి కొందరు ఫేక్ పట్టాలు తయారు చేసి ఒక్కో ప్లాట్ కు రూ. 2 నుంచి 3 లక్షలు వసూలు చేశారు. దీంతో కొందరు తహసీల్దార్ కు ఫిర్యాదుతో చేయడంతో మహబూబ్ నగర్ రూరల్ పీఎస్ లో  కేసు నమోదు చేసి. పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం సాయంత్రం నిందితులైన రాయుడు, దేవాను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు.  

వారి వద్ద కొన్ని ఫేక్ ఇండ్ల పట్టాలు, అగ్రిమెంట్ కాపీలు, జిరాక్స్ పట్టాలు, రెవెన్యూ నకిలీ ముద్రలతో పాటు బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులకు క్రిస్టియన్ పల్లి వార్డు కౌన్సిలర్ రాణి భర్త రాజు, శ్రీకాంత్ గౌడ్ సహకరించారని విచారణలో తేలింది. రాయుడు, దేవా, రాజును అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని  ప్రజలెవరూ ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇస్తామని మధ్యవర్తులు, దళారులు చెబితే నమ్మి మోసపోవద్దని సూచించారు. సర్వే నంబర్ 523లో ఎవరైనా దొంగ పట్టా ద్వారా మోసపోయి ఉంటే సరైన ఆధారాలతో రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.