అయోధ్య తీర్పుపై సమీక్షకు వెళ్తాం : ముస్లిం పర్సనల్ లాబోర్డు

అయోధ్య తీర్పుపై సమీక్షకు వెళ్తాం : ముస్లిం పర్సనల్ లాబోర్డు

అయోధ్య తీర్పుపై సమీక్షకు వెళ్లాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. ఈ నెల 9న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ ఫైల్ చేయనుంది. అయితే రివ్యూ పిటిషన్ వల్ల ఎలాంటి లాభం ఉండబోదని బోర్డు సభ్యలే అంటుండగా… అసలు AIMPLB కేసులో పార్టీయే కాదంటున్నారు హిందూపక్ష నేతలు.

లక్నోలో ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశమై… సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించింది. ఈ నెల 9న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. వివాదానికి కేంద్రంగా ఉన్న 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్ కు కేటాయించింది. మసీదు నిర్మించుకోవడానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించింది. అయితే ఈ భూమిని తీసుకోవద్దని లాబోర్డు నిర్ణయించింది.

మసీదు కోసం ఆలయాన్ని ధ్వంసం చేయలేదన్నారు AIMPLB సభ్యులు. సుప్రీంకోర్టు సూచించిన 5 ఎకరాల భూమిని తిరస్కరిస్తున్నామన్నారు. మసీదు కింద రామజన్మస్థానం లేదని సుప్రీంతీర్పులో ఉందన్నారు. తీర్పులో న్యాయం లేదన్నారు నేతలు. తీర్పులో అనేక పరస్పర వైరుధ్యాలున్నాయన్నారు.రివ్యూ పిటిషన్ 100 శాతం డిస్మిస్ అవుతుందని తమకు తెలుసునన్నారు జమైత్ ఉలేమా ఇ హింద్ నేత మౌలానా అర్షద్ మదానీ. రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం తమ హక్కు అని చెప్పారు.

టైమ్ వేస్ట్ చేసేందుకే రివ్యూ పిటిషన్ : విశ్వహిందూ పరిషత్

అయోధ్య కేసులో ముస్లిం పర్సనల్ లాబోర్డు పార్టీ కాదన్నారు విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ కమిటీ అలోక్ కుమార్. థర్డ్ పార్టీ అయిన లాబోర్డు రివ్యూ పిటిషన్ సక్సెస్ కాబోదన్నారు. సుప్రీం తీర్పును స్వాగతించాలన్నారు. టైమ్ వేస్ట్ చేసేందుకే ఈ నిర్ణయమన్నారు అలోక్ కుమార్.

AIMPLB తీరును ముస్లిం మతపెద్దలు వ్యతిరేకిస్తున్నారు. దేశంలోని హిందూ-ముస్లిలంతా తీర్పును స్వాగతించారని… రివ్యూ పిటిషన్ అక్కర్లేదన్నారు. ముస్లిం పర్సనల్ లాబోర్డులోని కొందరు పెద్దలు బాబ్రీ మసీదు పేరుతో చందాలు వసూలు చేశారని సుహైబ్ ఖాజ్మీ ఆరోపించారు. వారి దుకాణం బంద్ అవుతుందనే భయంతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును అంతా గౌరవించాలన్నారు బాబ్రీ మసీద్ లిటిగెంట్ ఇక్బాల్ అన్సారీ. పిటిషన్లు అక్కర్లేదన్నారు.

అయోధ్య కేసులో AIMPLB అసలు లిటిగెంటే కాదన్నారు లాయర్ వరుణ్ సిన్హా. ఈ విషయంలో సున్నీ వక్ఫ్ బోర్డే నిర్ణయం తీసుకోవాలన్నారు. తీర్పులో ఎలాంటి లీగల్ ఎర్రర్ లేదని స్పష్టం చేశారు. అయోధ్య తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు బెంచ్ లో ఉన్న ఒకే ఒక ముస్లిం జడ్జ్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు Z కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. కర్ణాటక కోటాలో ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు CRPF సిబ్బందితో సెక్యూరిటీ కల్పించనుంది కేంద్ర హోంశాఖ.