మున్సిపల్ బిల్లుపై ఆఫీసర్ల మధ్య లొల్లి!

మున్సిపల్ బిల్లుపై ఆఫీసర్ల మధ్య లొల్లి!

హైదరాబాద్, వెలుగు: కొత్త మున్సిపల్ చట్టం బిల్లుపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అభ్యంతరాలు చెప్పి, తిప్పి పంపడం ఇద్దరు సీనియర్ ఉన్నతాధికారుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఈనెల 19న బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాక సర్కారు గవర్నర్ ఆమోదానికి పంపించింది. ఇందులో మున్సిపల్ ఎన్నికల తేదీలను సర్కారే నిర్ణయిస్తుందని ఉండడం, కలెక్టర్లకు కీలక మున్సిపల్ అధికారాలను కట్టబెట్టడం లాంటి అంశాలపై గవర్నర్ అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్నే చెబుతూ బిల్లును తిప్పి పంపించడంతో దీన్ని మరోసారి పరిశీలించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో 21న ఆదివారమైనా సెక్రటేరియట్లో హడావుడి మొదలైంది.

సీఎస్ జోషి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు, జీఏడీ, మున్సిపల్ అధికారులు సెక్రటేరియట్ కు వచ్చారు. ఇంతమంది అధికారులు ఆదివారం ఒక్కసారిగా రావడంతో సెక్రటేరియట్ పోలీస్ లు, అటెండర్లు కూడా ఆశ్చర్యపోయారు. గవర్నర్ తిప్పి పంపిన బిల్లు సెక్రటేరియట్ ఏ బ్లాక్ లోని న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావుకు ఆఫీసుకు చేరింది. అభ్యంతరం చెప్పిన క్లాజులు, సబ్జెక్ట్ లను, సూచనలను ఆయన పరిశీలించారు. అదే సమయంలో డీ బ్లాక్ లో ఉన్న మున్సిపల్ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. కాసేపటికి అరవింద్ కుమార్ తన పేషీ నుంచి ఏ బ్లాక్ కు వచ్చి నిరంజన్ రావుతో మాట్లాడారు. బిల్లుపై మాట్లాడుకునే సమయంలో ఇద్దరి మధ్య గరంగరంగా చర్చ జరిగినట్లు సమాచారం. బిల్లులో న్యాయపరమైన అన్ని అంశాలను సరిచూసుకోలేదన్న అంశమే వీరిద్దరి మధ్య మాటలయుద్ధానికి కారణంగా తెలుస్తోంది. గంటపాటు న్యాయశాఖ పేషీలో ఉన్న అరవింద్ కుమార్ బిల్లును తీసుకొని నేరుగా సీబ్లాక్ (సమతా)కు
వెళ్లి సీఎస్ జోషితో సమావేశమయ్యారు. తర్వాత డీ బ్లాక్ కు తిరిగివెళ్లారు.

అభ్యంతరాలు… అయినా ఒకే

సెక్రటేరియట్లో ఇంత చర్చకు దారితీసిన బిల్లు ఆదివారమే ఆమోదం పొందడం విశేషం. తాను అభ్యంతరాలు చెప్పిన బిల్లునే గవర్నర్ ఆమోదించారు. దీన్ని గవర్నర్ ఆమోదించడంతో గెజిట్ ఇస్తున్నట్లుగా అదేరోజు న్యాయశాఖ జీవో 34 ఇచ్చింది. దీంతో ఒకరకంగా అదే రోజు నుంచి కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చినట్లైంది. ఆ తర్వాత గవర్నర్ సూచించిన సవరణలతో సర్కారు ఆర్డినెన్స్ ను సిద్ధం చేసింది. దీన్ని మంగళవారం గవర్నర్ ఆమోదించడంతో కొత్త చట్టం వచ్చిన రెండురోజులకే మార్పులు చేసినట్లైంది.