
- పాడుబడ్డ బంగ్లాలో శిథిలమవుతున్న చారిత్రక సంపద
- అరుదైన వస్తువులను పట్టించుకునే దిక్కులేదు
- భద్రపరచడంలో పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం
- సైట్ మ్యూజియం ఏర్పాటు చేయని ప్రభుత్వం
- ఇప్పటికే కొన్ని శిల్పాలు, శాసనాలు చోరీ
రాష్ట్రంలో ప్రాచీన బౌద్ధక్షేత్రం ఫణిగిరి. గతంలో జరిపిన తవ్వకాల్లో ఎన్నో అరుదైన శిల్పాలు, శాసనాలు, వస్తువులు ఇక్కడ బయటపడ్డాయి. కానీ ఎంతో అపురూపమైన ఈ చారిత్రక సంపదను ఎవరూ పట్టించుకోలేదు. శిల్పాలను జాగ్రత్తగా రక్షించి, భద్రపరచడంలో నిర్లక్ష్యం చేసిన పురావస్తు శాఖ అధికారులు.. వాటిని ఓ పాత బంగ్లాలో మూలకు పడేశారు.
1941 నుంచి..
బౌద్ధంలోని హీనాయాన, మహాయాన శాఖలకు ఫణిగిరి ప్రసిద్ధిచెందింది. విహారాలుగా పిలిచే బౌద్ధ సన్యాసుల నివాసాలు ఇక్కడి గుట్టపై ఉండేవి. రెండు వేల ఏళ్ల నాటికి చెందిన ఆధారాలు సేకరించేందుకు నిజాం సంస్థానంలోని ఆర్కియాలజీ విభాగం అధికారి ఖాజా మహ్మద్ ఆధ్వర్యంలో ఫణిగిరి గుట్టపై 1941 నుంచి 1944 వరకు తొలిసారి తవ్వకాలు చేపట్టారు. మళ్లీ ఆరు దశాబ్దాల తర్వాత రాష్ట్ర ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో 2001 నుంచి 2007 వరకు నాలుగు సార్లు, 2013–14 మధ్య ఒకసారి తవ్వకాలు జరిపారు. మరోసారి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2న మొదలైన తవ్వకాలు మే 15తో ముగియనున్నాయి.
చారిత్రక సంపద
ఐదున్నర అడుగుల బుద్ధ విగ్రహం, ఇక్ష్వాక రాజైన రుద్రపురుష దత్తు కాలం నాటి స్తంభం, శాసనం, చైత్యగృహలు, విహారాలు, జాతక కథలకు సంబంధించిన శిల్పాలు, మహాస్తూపం, చైత్యగృహాలు, ఉద్దేశిక స్తూపాలు, బౌద్ధచిహ్నాలు, సిద్ధార్థ, గౌతముని జీవిత ఘటాలు మలిచిన శిల్పాలు, శాతవాహన క్షేత్రాలు, ఇక్ష్వాకుల, మహావీరుల నాణేలు, మట్టి, సున్నపు బొమ్మలు, పూసలు అనేకం తవ్వకాల్లో వెలుగు చూశాయి. ఇటీవలి తవ్వకాల్లో ఏడో రోమన్ చక్రవర్తి నెర్వ క్రీ.శ 96లో విడుదల చేసిన 7.3 గ్రాముల బరువైన బంగారు నాణెం తొలిసారిగా బయటపడింది. ఇక్ష్వాక రాజు ఎహువల శాంతమూలుని పాలన కాలానికి సంబంధించిన శాసనాలు లభించాయి. అప్పటి వరకు ఆయన 11 ఏళ్లు మాత్రమే పాలించినట్లు ఆధారాలు లభించగా, 18 ఏళ్లు పాలించాడని తెలిపే శాసనం బయటపడింది. అందులోనే శ్రీకృష్ణుని ప్రస్తావన కూడా ఉంది. కృష్ణుడిని పేర్కొన్న తొలి శాసనం కూడా ఫణిగిరి దగ్గర దొరకడం మరో విశేషం. వీటిలో కొన్ని శిల్పాలను 2005లో ఏపీలోని అమరావతిలో జరిగిన కాలచక్ర ఉత్సవాలకు తరలించారు. మళ్లీ వాటిని ఇక్కడికి తిరిగి తీసుకురాలేదు.
ఎప్పుడు కూలుతుందో?
డంగు సున్నం, ఇటుకలతో తయారు చేసిన ఆరడుగుల బోధిసత్వుడి విగ్రహం ఇటీవల తవ్వకాల్లో బయటపడగా తెలంగాణ హెరిటేజ్ మ్యూజియానికి తరలించారు. అయితే 2007 వరకు జరిగిన తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు, నాణేలు, స్తూపచైత్యాలు, శాసనాలను తవ్విన చోటే పడేశారు. ఇందులో కొన్ని చోరీకి గురయ్యాయి. ఈ పరిస్థితిని చూసి చలించిన చరిత్ర పరిశోధకుడు కె.జితేంద్రబాబు 2009లో స్థానికంగా ఓ భవనాన్ని కొనుగోలు చేసి అందులోకి తరలించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ భవనాన్ని ఎంపీ కవిత కొనుగోలు చేసి ఆర్కియాలజీ విభాగానికి అప్పగించారు. అయితే పాత కాలం నాటి ఈ బంగ్లా ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి.
మ్యూజియం ఏర్పాటు చేయాలె..
గతంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టిన సందర్భంలో శిల్పాలు, నాణేలు, ఆది మానవులు ఉపయోగించిన పరికరాలు బయటపడితే వాటిని ప్రదర్శనకు పెట్టేందుకు ఆయా జిల్లా కేంద్రాల్లో మ్యూజియాలను ఏర్పాటు చేశారు. ఇలా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, పానగల్లు (నల్లగొండ), పిల్లలమర్రి(మహబూబ్‌నగర్), కొండాపూర్ (సంగారెడ్డి) తదితర ప్రాంతాల్లో మ్యూజియాలు ఏర్పాటయ్యాయి. ఫణిగిరిలో అమూల్యమైన చారిత్రక సంపద దొరికినా, సందర్శకుల కోసం ప్రభుత్వం మ్యూజియం ఏర్పాటు చేయకపోవడంపై చరిత్రకారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫణిగిరిలోనే సైట్ మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.