
తిరుమలలో ఇటీవల దేవుడి పేరు మీద నకిలీ వెబ్ సైట్లు సృష్టించి, భక్తులను తప్పుదోవ పట్టించి విరాళాలు, శ్రీవారి దర్శనం, ప్రసాదాల రూపంలో దండుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్లు. దర్శనాలు, గదులు, ప్రసాదాల విషయంలో ఏర్పాటు చేసిన నకిలీ వెబ్ సైట్ల మాయలో పడితే ఆలస్యంగా అయినా మోసపోయామని తెలిసిపోతుంది. అచ్చంగా అసలు వెబ్ సైట్లను పోలినట్టే ఈ నకిలీ వెబ్ సైట్లు కూడా ఉండటం విశేషం. దాదాపు 30 కు పైగా నకిలీ వెబ్ సైట్ లను గూగుల్ నుంచి తొలగించారు అధికారులు.
తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు తిరుమల పోలీసులు గూగుల్ సెర్చ్ ఇంజన్ లో మొత్తం 32 నకిలీ వెబ్ సైట్లు గుర్తించి.. 28 వెబ్ సైట్లను తొలగించారు. శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై కేవలం. https://www.tirumala.org మాత్రమే Tirumala Tirupati Devasthanam అధికారిక వెబ్ సైట్. మరే ఇతర వెబ్ సైట్లు అధికారిక వెబ్ సైట్లు కాదు, దీనిని భక్తులు గుర్తించి జాగ్రత్తలు వహించి మోసపోకుండా ఉండవలెనని టీటీడీ సూచించింది. నకిలీ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులకు పిలుపునిచ్చింది.
టీటీడీ కీలక సూచనలు
- భక్తులు ఎవరైనా గూగుల్ లో సెర్చ్ చేసేటపుడు నకిలీ వెబ్ సైట్ లలో ఏదైనా గెస్ట్ హౌస్ పేరుమీద ఉంటే అవి నకిలీవని తెలుసుకోవాలి.
- ఉదాహరణకు సప్తగిరి గెస్ట్ హౌస్, రాంబగీచ గెస్ట్,హౌస్ నందకం గెస్ట్ హౌస్, పద్మావతి నిలయం లాంటి పేర్లతో ఉండే వెబ్ సైట్లు ఏవి కూడా అధికారిక వెబ్ సైట్లు కాదు. ఇవన్నీ నకిలీ వెబ్ సైట్లు అని భక్తులు గమనించగలరు.
- అదేవిధంగా ఎవరైనా వాట్సప్ కాల్ ద్వారా మీకు క్యూఆర్ కోడ్ పంపి పేమెంట్ చేయమంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలాంటి సందర్భంలో వెంటనే మీకు దగ్గరగా ఉండే పోలీస్ స్టేషన్లో కానీ, లేదా Dail 100 లేదా112 కానీ, TTD టోల్ ఫ్రీ నెంబర్ 18004254141 కు కాల్ చేసి మీ అనుమానాలను క్లియర్ చేసుకోవలెను.