నాగార్జున సాగర్ డ్యాం అన్నీ గేట్లు ఓపెన్..పర్యాటకుల సందడే సందడి

నాగార్జున సాగర్ డ్యాం అన్నీ గేట్లు ఓపెన్..పర్యాటకుల సందడే సందడి

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. బుధవారం(ఆగస్టు13) కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టులోని 26 క్రస్ట్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో డ్యామ్ నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని చూసేందుకు, డ్యాం పరిసర ప్రాంతాల్లో ప్రకృతి అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు ప్రస్తుతం 2లక్షల54వేల784 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో 2లక్షల 90,795 క్యూసెక్కులుగా ఉంది. భారీగా వస్తున్న వరదను నియంత్రించేందుకు, అదే సమయంలో ప్రాజెక్టు భద్రతను కాపాడేందుకు అధికారులు 26 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు.

 నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం  589.40 అడుగులుగా ఉంది.  సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం  312 టీఎంసీలు..ప్రస్తుతం 310.510 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

సాగర్  గేట్లు ఎత్తటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.