వినోద్ ఖోస్లా బాంబ్: 5 ఏళ్లలో ఐటీ, బీపీఓ జాబ్స్ మాయం..! ఏఐ వినాశనం మొదలైందా?

వినోద్ ఖోస్లా బాంబ్: 5 ఏళ్లలో ఐటీ, బీపీఓ జాబ్స్ మాయం..! ఏఐ వినాశనం మొదలైందా?

ప్రముఖ టెక్ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా భారతీయ ఐటీ రంగంపై బాంబు పేల్చారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకుంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఏఐ దెబ్బకు రాబోయే 5 ఏళ్లలో భారతదేశపు ప్రధాన ఆదాయ వనరులైన ఐటీ సేవలు, బీపీఓ రంగాలు దాదాపుగా కనుమరుగవుతాయని బాంబు పేల్చారు. అయితే ఆయన చెప్పిన మాటలు కూడా ప్రస్తుతం ఏఐ దూకుడు చూస్తుంటే వాస్తవికతగా చాలా దగ్గరగానే ఉన్నాయి. 

5 ఏళ్లలోనే ఐటీ రంగాని ముగింపు?
గతంలో వచ్చిన ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ విప్లవాలు కేవలం ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే మార్చాయన్నారు వినోద్ ఖోస్లా. కానీ ఏఐ అనేది నేరుగా మానవ మేధస్సునే భర్తీ చేస్తోందని వెల్లడించారు. అందువల్ల రానున్న ఐదేళ్లలో చాలా విషయాల్లో మనుషుల కంటే ఏఐ మెరుగ్గా పనిచేస్తుందని.. దీనివల్ల ప్రస్తుతం మనం చూస్తున్న సాంప్రదాయ ఐటీ సర్వీసెస్, బీపీఓల అవసరం ఉండదని కుండ బద్దలు కొట్టారు. ఇప్పుడు 22-25 ఏళ్ల వయసున్న యువత తమ 40వ ఏటకు వచ్చేసరికి ప్రపంచంలో ఉద్యోగాల సంఖ్య ఊహించనంతగా తగ్గిపోతుందని హెచ్చరించారు.

కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే కాదు.. రాబోయే 15 ఏళ్లలో అకౌంటెంట్లు, డాక్టర్లు, లాయర్లు, ఆర్కిటెక్ట్లు, చిప్ డిజైనర్లు వంటి నిపుణుల అవసరం కూడా తగ్గిపోతుందని ఖోస్లా అంచనా వేశారు. ఏఐ వర్కర్లు మానవ అకౌంటెంట్ల కంటే మెరుగ్గా లెక్కలు తేల్చగలరని, క్యాన్సర్ నిర్ధారణలో నిష్ణాతులైన డాక్టర్ల కంటే ఏఐ మెరుగ్గా పనిచేస్తుందని వివరించారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత పెరిగినప్పటికీ.. ఉపాధి ఉద్యోగ అవకాశాలు మాత్రం భారీగా దెబ్బతింటాయన్నారు.

రోబోటిక్ విప్లవం.. 
మేధోపరమైన పనుల తర్వాత రోబోటిక్ విప్లవం వస్తుందని.. ఇది శ్రమతో కూడిన పనులను పూర్తిగా మార్చేస్తుందని ఖోస్లా చెప్పారు. ఇంట్లో గిన్నెలు కడగడం నుంచి ఫ్యాక్టరీ అసెంబ్లీ లైన్ల వరకు రోబోలే ఆక్రమిస్తాయని వీటి నిర్వహణ ఖర్చు గంటకు కేవలం 2 నుంచి 3 డాలర్లు అంటే దాదాపు రూ.160 - రూ.250 మాత్రమే ఉంటుందని వెల్లడించారు. దీనివల్ల 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు విపరీతంగా తగ్గి డీఫ్లేషనరీ ఎకానమీ ఏర్పడుతుందని షాకింగ్ విషయం వెల్లడించారు.

భారతదేశానికి ఏకైక మార్గం ఇదే..
భారత్ తన వద్ద ఉన్న 25 కోట్ల మంది యువతను కేవలం ఐటీ సేవలకే పరిమితం చేయకుండా.. ఏఐ ఆధారిత వస్తువులను, సేవలను ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఖోస్లా సూచించారు. దేశం సొంతంగా సావరిన్ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసుకోవాలని.. అప్పుడే అమెరికా, చైనాల ఆధిపత్యాన్ని అడ్డుకోగలమని చెప్పారు. అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలు ఆ దేశానికే నష్టమని.. హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు ఆవిష్కరణలను అడ్డుకుంటాయని విమర్శించారు. మొత్తానికి వినోద్ ఖోస్లా మాటలు వింటుంటే మార్పును అందిపుచ్చుకున్న వారు మాత్రమే ఈ ఏఐ సునామీలో నిలబడగలరని తెలుస్తోంది. ఈ మార్పును తట్టుకోవడానికి ప్రభుత్వాలు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆయన హెచ్చరించారు.