నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకాదరణ పొందిన క్రైమ్ డ్రామా సిరీస్ లలో ‘కోహ్రా’ సీజన్ ఒకటి. "కోహ్రా" అంటే పొగమంచు' అని అర్ధం. ఇప్పుడు సీజన్ 2 క్రైమ్ థ్రిల్లర్ ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మబ్బులతో కమ్ముకున్న డాలర్‌పురా అనే పట్టణాన్నికేంద్రంగా చేసుకుని సాగే ఈ కొత్త సీజన్, మరింత డార్క్, లోతైన మర్డర్ మిస్టరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
పంజాబ్‌లోని ఒక చిన్న పట్టణంలో జరిగిన హత్య, దాని చుట్టూ అల్లుకున్న అబద్ధాలు, రహస్యలే ఈ సీజన్ కథ. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ సినిమాల్లో ఒకటిగా దూసుకెళ్తోంది. అందుకు కారణం మొదటి సీజన్ని మించిన కథ, ట్విస్టులు ఉండటమే. సుదీప్ శర్మ, ఫైసల్ రహ్మాన్ దర్శకత్వం వహించిన ఈ 6 ఎపిసోడ్ల సిరీస్ ఉత్కంఠగా సాగుతోంది. సామాజిక అసమానతలు, కుటుంబం మరియు వ్యవస్థలోని లోపాలను (ముఖ్యంగా దలేర్‌పురాలో) లోతుగా విశ్లేషిస్తుంది. తెలుగులో కూడా ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.
కథేంటంటే?
పంజాబ్‌లోని గ్రామీణ ప్రాంతంలో ప్రీత్ బజ్వా (పూజా భమ్ర్రా) హత్యకు గురవుతుంది. ఆమె మృతదేహం తన అన్న బాల్జిందర్ (అనురాగ్ అరోరా) పశువుల పాకలో లభించడం సంచలనంగా మారుతుంది. హత్య వెనుక నిజం ఏమిటో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. అనుమానాలు మొదట కుటుంబ సభ్యులపైనే పడతాయి. ముఖ్యంగా ఆమె భర్త పాత్రలో కనిపించే రణ్‌విజయ్ సింఘా పాత్ర కీలకంగా మారుతుంది.
అదే రాత్రి ఒక కేర్‌టేకర్ అదృశ్యమవుతాడు. ఝార్ఖండ్ నుంచి ఒక యువకుడు (ప్రయారక్ మెహతా) తన తండ్రిని వెతుక్కుంటూ డాలేర్‌పురాకు రావడం కథకు మరో మలుపు ఇస్తుంది. దర్యాప్తులో బాండెడ్ లేబర్, ఇండస్ట్రియల్ ఎక్స్‌ప్లాయిటేషన్, కుటుంబ రహస్యాలు, ప్రేమికుడు జానీ మలాంగ్ (విఖ్యాత్ గులాటీ) మోసాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి.
ఈ కేసును అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అమర్‌పాల్ గరుండి (బరుణ్ సోబ్తి) విచారిస్తాడు. అయితే ఈసారి అతడు కొత్త కమాండింగ్ ఆఫీసర్ సబ్ ఇన్‌స్పెక్టర్ ధన్వంత్ కౌర్ (మోనా సింగ్) ఆధ్వర్యంలో పనిచేయాల్సి వస్తుంది. వీరి దర్యాప్తు కేవలం హత్య రహస్యానికే పరిమితం కాకుండా, సమాజంలో దాగి ఉన్న అన్యాయాలను వెలికితీస్తుంది.
👀 👀 👀 pic.twitter.com/PtloywYL02
— Netflix India (@NetflixIndia) February 16, 2026
భయానకతకు కొత్త నిర్వచనం..
‘కోహ్రా’ సీజన్ 2 పోలీస్ ప్రొసీజరల్‌గా కనిపించినా, లోతుగా చూస్తే ఇది మన సమాజపు చీకటి మూలాలను బయటపెట్టే హారర్ కథ. స్లోగా మొదలై పేస్ అందుకొనే స్టైల్‌లో సాగుతుంది. మొదటి సీజన్‌లో డ్రగ్స్ థీమ్ ఉంటే, ఇక్కడ బాండెడ్ లేబర్, ఇండస్ట్రియల్ ఎక్స్‌ప్లాయిటేషన్, కుటుంబ ద్వేషాలు వంటి సామాజిక అంశాలపై దృష్టి పెడుతుంది. ఈ సీజన్‌లో భయానకత అనేది దెయ్యాలు కాదు, అధికారం, సంప్రదాయం పేరుతో బంధించబడిన మనుషులే.
ప్రీత్ సోదరుడు బాల్జిందర్ తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన భూస్వామ్యంతో పాటు బంధిత కార్మికత్వాన్ని కూడా కొనసాగిస్తాడు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను గొలుసులతో కట్టేసి పని చేయించడం కథలోని కీలక అంశం. ఈ అన్యాయం చివరకు అతని కుటుంబానికే శాపంగా మారుతుంది. గ్రామీణ భారతదేశంలో ఇంకా కొనసాగుతున్న అన్యాయ వ్యవస్థలపై గట్టిగా ప్రశ్నిస్తుంది. మబ్బులతో నిండిన విజువల్స్, భయపెట్టే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు తగిన వాతావరణాన్ని సృష్టిస్తాయి.
చివరగా..‘కోహ్రా’సీజన్ 2 కేవలం హత్య మిస్టరీ కాదు.మన సమాజపు చీకటి మూలాలపై ఒక గాఢమైన పరిశీలన. నెమ్మదిగా సాగినా, ఎమోషనల్ సీన్స్, సహజమైన కథనానికి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉత్కంఠ కలిగిస్తోంది.
