పులివెందుల ,ఒంటిమిట్ట బైపోల్... జగన్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పులివెందుల ,ఒంటిమిట్ట బైపోల్... జగన్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై మీడియా ప్రశ్నలకు సమాధానంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.  ఎప్పుడూ తాను చేసే అరాచకాలు ఈ సారి జరగలేదనే  అసహనంతో జగన్ ఉన్నారని చెప్పారు.  అతని నైజం ప్రజలకు తెలిసిందేనన్నారు. 

వైఎస్ హయాం నుంచి  పులివెందులలో  ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరగలేదన్నారు చంద్రబాబు.  నామినేషన్ వేయటానికే భయపడే పరిస్థితుల నుంచి 11మంది నామినేషన్ లు వేయగలిగారని తెలిపారు.  రెండు  పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ ఎప్పుడైనా జరిగిందా? అని ప్రశ్నించారు. శాంతి భద్రతల నిర్వహణ పటిష్టంగా జరిగింది కాబట్టే ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటేశారని చెప్పారు చంద్రబాబు.

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఆగస్టు 12న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే..పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. ఈ ఉపఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్యే కీలక పోటీ జరిగింది. 

అయితే  పోలింగ్ తీరుపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు.పులివెందులలో కుట్రపూరితంగా బూత్ లు మార్చారని జగన్ ఆరోపించారు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. భద్రత పేరుతో వందలాది మంది పోలీసులను పెట్టారు.  ఏపీలో ఇలాంటి ఉప ఎన్నిక ఇంత వరకు చూడలేదని ధ్వజమెత్తారు జగన్. ఈ క్రమంలోనే జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కామెంట్స్ చేశారు.