
వామ్మో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఏమైనా తినాలంటేనే భయమేస్తోంది. సరదాగా ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్ తో కానీ బయటకెళ్లి ఏమైనా తిందామా ?అని వెళ్తే అక్కడికెళ్లాక..కుళ్లిపోయిన బిర్యానీలు, ఐస్ క్రీంలో చేతి వేళ్లు, పురుగులు ఇలాంటి ఘటనలు చూస్తేనే తిన్నది కాస్త బయటకొస్తుంది.
లేటెస్ట్ గా బేకరీకి వెళ్లిన ఓ ఫ్యామిలీకి ఇలాంటి ఒళ్లు జలదరించే ఘటనే ఎదురయ్యింది. పిల్లలతో కలిసి కర్రీ పఫ్ ఆర్డర్ చేసిన వాళ్లకు అందులో పాము పిల్ల కనిపించింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే.. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల లో ఓ బేకరీలో కర్రీ పఫ్ ఆర్డర్ వేసింది ఓ ఫ్యామిలీ. తీరా తనడం స్టార్ట్ చేయగానే ఆ కర్రీ పఫ్ లో చిన్న పాము పిల్ల ప్రత్యక్షమైంది. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆ బేకరీ యాజమాన్యాన్ని నిలదీశారు. దీనిపై నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వాళ్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని తనిఖీలు చేసి హెచ్చరించినా హోటళ్లు,రెస్టారెంట్లు తమ తీరును మార్చుకోవడం లేదు. అధికారులు వచ్చి తనిఖీలు చేసి వెళ్లిపోగానే మళ్లీ ఎప్పటిలానే ప్రవర్తిస్తున్నారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోన్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.