ఏఐ వాడకం అన్ని రంగాల్లో విస్తృతంగా పెరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు క్యాన్సర్‌ని గుర్తించడంలోనూ ఏఐని వాడుతున్నారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో పసిగట్టడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. సాధారణంగా రేడియాలజిస్టులు మామోగ్రామ్ స్కాన్లను పరిశీలించి అనుమానాస్పద మార్పులను గుర్తిస్తారు. అయితే, ప్రారంభ దశలో ఉన్న క్యాన్సర్లు కొన్నిసార్లు కంటికి కనిపించకపోవచ్చు. అలాంటివాటిని కూడా ఏఐ గుర్తిస్తోంది.
ఈ మధ్య వచ్చిన ఒక స్టడీ ప్రకారం.. ఏఐ సాయంతో టెస్ట్ రిపోర్ట్‌లను పరిశీలించడం వల్ల స్క్రీనింగ్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే మహిళల సంఖ్య 12 శాతం తగ్గినట్టు తేలింది. ఈ పరిశోధనలో స్వీడన్‌లోని ల్యూండ్ యూనివర్సిటీ రీసెర్చర్లతోపాటు నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్‌లోని కొన్ని సంస్థలు పాల్గొన్నాయి. ఈ పరిశోధన లక్షా 6 వేల మంది మహిళలపై చేశారు. వాళ్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. మొదటి గ్రూప్ మహిళలకు టెస్ట్‌లు చేసి ఆ మామోగ్రామ్ రిపోర్ట్‌లను ఏఐతో పరిశీలించారు. రెండో గ్రూప్ మహిళల రిపోర్ట్‌లను సాధారణ పద్ధతిలో రేడియాలజిస్టులు చూసి క్యాన్సర్‌ని నిర్ధారించారు. రేడియాలజిస్ట్‌లతో పోలిస్తే.. ఏఐ సందేహాస్పదమైన భాగాలను బాగా హైలైట్ చేసింది.
81 శాతం క్యాన్సర్లను..
భవిష్యత్తులో రాబోయే క్యాన్సర్ల(ఇంటర్వెల్ క్యాన్సర్లు)ను గుర్తించడంలో రేడియాలజిస్ట్‌ల కంటే ఏఐ ముందుంది. రెండేండ్ల తర్వాత మళ్లీ ఏఐ స్క్రీనింగ్ చేస్తే.. గ్రూపులో ప్రతి వెయ్యిలో 1.55 మంది మహిళల(53,043 లో 82మందికి)కు ఇంటర్వెల్ క్యాన్సర్లు వచ్చాయి. రేడియాలజిస్ట్‌లు స్క్రీనింగ్ చేసిన గ్రూపులో ప్రతి వెయ్యిలో 1.76 మంది మహిళలకు ఇంటర్వెల్ క్యాన్సర్లు (52,872 లో 93మంది) వచ్చినట్టు కనుగొన్నారు. దీనివల్ల క్యాన్సర్ తీవ్రత పెరగకముందే గుర్తించే అవకాశం పెరిగింది. దాంతో ట్రీట్‌మెంట్ అందించడం సులభమవుతుంది. రోగి బతికే అవకాశాలు పెరుగుతాయి. పైగా ఏఐ వల్ల రేడియాలజిస్టుల పని భారం కూడా 44 శాతం తగ్గుతుంది.
క్యాన్సర్లను గుర్తించిన ఈ ఏఐ సిస్టమ్‌కు లక్షలాది మామోగ్రామ్ రిపోర్ట్‌లతో ముందుగానే ట్రైనింగ్ ఇచ్చారు. ఇది 10కి పైగా దేశాల నుంచి తీసుకొచ్చిన రెండు లక్షలకు పైగా రకరకాల క్యాన్సర్ పేషెంట్ల రిపోర్ట్‌ల డేటాను విశ్లేషించి కొత్త రిపోర్ట్‌లను స్క్రీనింగ్ చేసింది.
