IPL 2026: ఆ ఇద్దరికీ 25 నుంచి 30 కోట్లు పక్కా.. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు అశ్విన్ జోస్యం

IPL 2026: ఆ ఇద్దరికీ 25 నుంచి 30 కోట్లు పక్కా.. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు అశ్విన్ జోస్యం

ఐపీఎల్ 2025 ముగిసిన కొన్ని నెలలకే 2026  మినీ వేలంపై ఆసక్తి నెలకొంది. గత సీజన్ లో మెగా ఆక్షన్ ముగిసిన తర్వాత 2026లో మినీ వేలం జరగనుంది. నవంబర్ లో ఈ మినీ ఆక్షన్ జరిగే అవకాలు కనిపిస్తున్నాయి. ఫ్రాంచైజీలు ఎవర్ని రిలీజ్ చేస్తారో ఆసక్తికరంగా మారింది. విఫలమైన ప్లేయర్స్ కు ఆయా ఫ్రాంచైజీలు చెక్ పెట్టనున్నాయి. ముఖ్యంగా గత సీజన్ లో ఘోర ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి జట్లు చాలా మంది ప్లేయర్లను వేలంలోకి వదిలేయనుంది. 

2026 ఐపీఎల్ కోసం ఐపీఎల్ లో ఎవరిని ఎక్కువ ఖర్చు చేసి ఫ్రాంచైజీలు కొంటారనే విషయంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ తన అంచనాను తెలిపాడు. తన యూట్యూబ్ ఛానల్ 'ఆష్ కి బాత్' లో మాట్లాడుతూ..రాబోయే మినీ వేలంలో స్టార్ భారత ఆటగాళ్లను రిలీజ్ చేయడం  ఏ ఫ్రాంచైజీకైనా చాలా ప్రమాదకరమని అశ్విన్ వివరించాడు.  విదేశీ స్టార్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలంలో ఆస్ట్రేలియన్ ఆటగాళ్ల భారీ ధర పలకడం ఖాయమని కామెరూన్ గ్రీన్, మిచెల్ ఓవెన్ పేర్లు తెలిపాడు. 

"పంజాబ్ కింగ్స్ జట్టులో రీప్లేసెమెంట్ గా మిచెల్ ఓవెన్ వచ్చాడు. మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడే ఛాన్స్ వచ్చింది. కామెరాన్ గ్రీన్ లాంటి ఆల్ రౌండర్ వేలంలోకి వస్తాడు. వీరిద్దరూ విదేశీ ఆల్ రౌండర్లు కావడంతో ఎక్కువ ధరకు ఫ్రాంచైజీలు కొంటారు. మినీ వేలంలో అన్ని జట్లు వీరిద్దరి కోసం రూ. 25-30 కోట్లు ఖర్చు చేస్తారు". అని అశ్విన్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. అశ్విన్ చెప్పినట్టు ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్  కామెరాన్ గ్రీన్ ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక ధర పలికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

గ్రీన్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగలడు. ఇలాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ జట్టులో ఉంటే ఏ జట్టు అయినా పటిష్టంగా మారుతుంది. ఈ ఆజానుభావుడుపై చాలా ఐపీఎల్ జట్లు కన్నేసినట్టు సమాచారం. గాయంతో 2025 ఐపీఎల్ కు దూరమైనా గ్రీన్ మళ్ళీ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. తన రీ ఎంట్రీలోనే ఈ ఆసీస్ ఆల్ రౌండర్ టాప్ ఫామ్ తో చెలరేగుతున్నాడు. వెస్టిండీస్ పై ఇటీవలే ముగిసిన   ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్యాటింగ్ లో గ్రీన్ దంచికొట్టాడు. వరుసగా 51, 56*, 11, 55*, 32 స్కోర్లు చేసి సత్తా చాటాడు. అంతేకాదు ఆదివారం (ఆగస్టు 10) సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. 

ఎవరీ మిచెల్ ఓవెన్..? 

మిచెల్ ఓవెన్‌ 2024-25లో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. హోబర్ట్ హరికేన్స్ తరపున 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 452 పరుగులు చేశాడు. బిగ్ బాష్ లీగ్ ఫైనల్లో ఓవెన్ కేవలం 42 బంతుల్లో 108 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 11 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. బిగ్ బాష్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. ఈ మెగా ఫైనల్లో 39 బంతుల్లో సెంచరీ చేసి పాకిస్థాన్ సూపర్ లీగ్ లో.. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ తర్వాత జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ లో.. ఇటీవలే ముగిసిన వెస్టిండీస్ టీ20 సిరీస్ లో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి సూపర్ ఫామ్ లో ఉన్నాడు.