మూడు రిజర్వాయర్ల నిర్మాణం ఆపండి

మూడు రిజర్వాయర్ల నిర్మాణం ఆపండి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఏపీ సర్కారుకు నేషనల్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ (ఎన్జీటీ) షాకిచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా మొదలుపెట్టిన మూడు రిజర్వాయర్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. గాలేరు, నగరి, హంద్రీనీవా విస్తరణ, లింక్‌‌‌‌ ప్రాజెక్టుల్లో భాగంగా చిత్తూరు జిల్లాలో మూడు కొత్త రిజర్వాయర్లను నిర్మించాలని ఏపీ నిర్ణయించింది. దీనికోసం పోయినేడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో టెండర్లు ఖరారు చేసింది. రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో భాగంగా కాంట్రాక్టు సంస్థ 500 ఏండ్ల నాటి సీతమ్మ టెంపుల్‌‌‌‌ను ధ్వంసం చేసిందని, తమ భూములను గుంజుకోవాలని చూస్తున్నారని చిత్తూరుకు చెందిన గుత్తా గుణశేఖర్‌‌‌‌‌‌‌‌ సహా పలువురు రైతులు ఎన్జీటీ చెన్నై బెంచ్‌‌‌‌లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌‌‌‌ను చెన్నై బెంచ్ జ్యుడీషియల్ మెంబర్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌ కె.రామకృష్ణన్‌‌‌‌, ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ సత్యగోపాల్‌‌‌‌ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సోమవారం విచారించారు. గాలేరు నగరి, హెచ్‌‌‌‌ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రాజెక్టులను లింక్‌‌‌‌ చేయడానికి 80 కిలోమీటర్ల పైపులైన్‌‌‌‌ వేస్తున్నారని, 400 కి.మీ కాలువ తవ్వుతున్నారని, మూడు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారని, పర్యావరణ అనుమతులు అవసరం లేదంటే ఎట్లా అని ఎన్జీటీ బెంచ్‌‌‌‌ ప్రశ్నించింది. ప్రాజెక్టుల స్కోప్‌‌‌‌ మారుతున్నందున పర్మిషన్స్‌‌ తప్పనిసరి అని పేర్కొంది.