వ్యవసాయ శాఖ టార్గెట్​ 1.43 కోట్ల ఎకరాలు

వ్యవసాయ శాఖ టార్గెట్​ 1.43 కోట్ల ఎకరాలు
  • 71 శాతం సాగైన పంటలు పత్తి 48.29 లక్షలు, వరి 
  • 34.95 లక్షల ఎకరాల్లో సాగు 
  • జోరందుకున్న వరి నాట్లు
  • ఈనెల చివరి వరకు అవకాశం 
  • పంటల సాగులో నల్గొండ టాప్‌‌

 

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటింది. నెల రోజులకు పైగా రాష్ట్రంలో భారీగా వానలు  కురవడంతో సాగుకు ఇబ్బందిగా మారింది. వానలు తగ్గడంతో పంటల సాగు ఊపందుకుంది. ప్రధానంగా వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈనెలాఖరు వరకు వరి సాగు చేసే అవకాశం ఉండడంతో రైతులు  వరి నాట్లు ముమ్మరం చేశారు.  దీంతో ఈ సీజన్‌‌లో పంటల సాగు క్రమంగా  పెరుగుతున్నది.  

46.74 లక్షల ఎకరాల్లో ఫుడ్‌‌ గ్రెయిన్స్‌‌
ఈ ఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో పంట సాగు చేయాలని వ్యవసాయశాఖ టార్గెట్‌‌ పెట్టుకుంది. కాగా, బుధవారం నాటికి  1కోటి 2లక్షల 39వేల ఎకరాల్లో పంటల సాగు నమోదైనట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక అందించింది. వానాకాలం సీజన్‌‌లో సర్కారు టార్గెట్‌‌లో ఇప్పటి దాకా 71శాతం పంటలు సాగైయ్యాయి. ఫుడ్‌‌ గ్రెయిన్స్‌‌46.74 లక్షల ఎకరాల్లో,  ఆయిల్‌‌ సీడ్స్‌‌ 3.96 లక్షల ఎకరాల్లో వేశారు. అయితే ఈ సీజన్‌‌లో వరి, మొక్కజొన్న, మిరప పంటలు మాత్రమే ఇంకా వేసుకోవడానికి చాన్స్​ ఉందని, ఈ పంటలు తప్పితే వేరే పంటలు వేసుకునే పరిస్థితి లేదని అగ్రికల్చర్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నరు.

6.62 లక్షల ఎకరాలతో సంగారెడ్డి సెకండ్​
వానాకాలం సీజన్‌‌ పంటల సాగు 8 జిల్లాల్లో ఎక్కవ సాగు రికార్డు అయ్యింది. అన్ని పంటల సాగులో ఇప్పటి దాకా 8.02 లక్షల ఎకరాలతో నల్గొండ టాప్‌‌లో నిలిచింది.  సంగారెడ్డిలో 6.62లక్షల ఎకరాలు, ఆదిలాబాద్‌‌లో 5.60 లక్షల ఎకరాలు, వికారాబాద్‌‌లో 5.23 లక్షల ఎకరాలు, నిజామాబాద్‌‌లో 4.51 లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 4.97 లక్షల ఎకరాలు, నాగర్‌‌ కర్నూల్‌‌లో 4.02 లక్షల ఎకరాలు, నారాయణపేట్‌‌లో 3.82 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 24 జిల్లాల్లో సాధారణ సాగులో 50 శాతం పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 30 శాతం, ములుగు జిల్లాలో 40 శాతం, భద్రాద్రి కొత్తగూడెం 45 శాతం, సూర్యాపేట జిల్లాలో 47 శాతం పంటలు సాగయ్యాయి.

ఈ సీజన్‌‌లో సాగైన పంటలు ఇవే..
ఈ సీజన్‌‌లో 70 లక్షల ఎకరాల్లో పత్తి  సాగు టార్గెట్‌‌  పెట్టగా, ఇప్పటి దాకా 48.29 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తికి అనుకూలమైన జులైలో అధికంగా వర్షాలు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 12లక్షల ఎకరాల్లో పంట నీట మునిగి దెబ్బతిన్నది. అయితే అప్పటికే రెండు, మూడు సార్లు పత్తి విత్తనాలు వేసిన రైతులు వానలతో తిరిగి వేసే వీల్లేకుండా పోయింది. పత్తి సాగు టార్గెట్‌‌ రీచ్‌‌ కాలేక పోయింది. వరి ప్రతిపాదిత లక్ష్యం 45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి దాకా 34.95 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. కంది 15లక్షల ఎకరాల్లో సాగు చేయాలని టార్గెట్‌‌ ప్రతిపాదించగా ఇప్పటిదాకా 5.47 లక్షల ఎకరాల్లో సాగైంది. సోయా సాధారణ సాగు లక్ష్యం 3.88 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి దాకా 3.85 లక్షల ఎకరాల్లో వేశారు. ఇది 99 శాతం సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు లక్ష్యం 8.18 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటిదాకా 5.04 లక్షల ఎకరాల్లో సాగైంది.

వరిలో నిజామాబాద్‌‌ టాప్‌‌
వరి సాగు చేసేందుకు ఇంకా చాన్స్​ ఉండటంతో రాష్ట్రంలో వరి నాట్లు జోరందుకున్నాయి. ఈ సీజన్‌‌లో వరి సాగు  లక్ష్యం 45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి దాకా 34.95 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. టార్గెట్‌‌లో 78 శాతం రీచ్‌‌ కావడం, ఇంకా గడువు ఉండటంతో టార్గెట్‌‌ మించే చాన్స్​ ఉంది. ఇప్పటి దాకా నిజామాబాద్‌‌ జిల్లా వరి నాట్లలో టాప్‌‌లో ఉంది. ఇప్పటి దాకా ఈ జిల్లాలో 3.58లక్షల ఎకరాల్లో వరి సాగైంది. తర్వాత కామారెడ్డిలో 2.74 లక్షల ఎకరాలు, జగిత్యాలలో 2.56లక్షల ఎకరాలు, మెదక్‌‌లో 2.37లక్షల ఎకరాలు, యాదాద్రిలో 2.20 లక్షల ఎకరాలు,  సిద్దిపేటలో, పెద్దపల్లిలో  2 లక్షల ఎకరాలు, కరీంనగర్‌‌లో 1.81 లక్షల ఎకరాలు, మహబూబాబాద్‌‌, సూర్యపేట, నల్గొండ, జనగాం, నారాయణపేట, సిరిసిల్లా లక్ష ఎకరాలకు పైగా వరి నాట్లు పడ్డాయి.