మహిళా సంఘాలను నిర్వీర్యం చేయొద్దు.. వారికి పడిన బకాయిలను విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పిన టీఆర్ఎస్ సర్కార్.. వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్టు కాదన్నారు. ఇవాళ (జూన్ 5న) మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఏ పనులు జరగాలన్నా మహిళల సహకారం లేకుండా సాధ్యం కాదన్నారు. 18 వేల మంది వీవోఎల్ ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఏపీలో రూ. 10వేలు జీతం తీసుకుంటే.. ఇక్కడ మాత్రం రూ. 3వేల 900 జీతం ఇవ్వడం సిగ్గు చేటన్నారు. మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలనే ఉద్ధేశంతో మహిళా సంఘాలు ఏర్పడ్డాయన్నారు. గతంలో 10 జిల్లాలు ఉంటే.. అందులో ఐదు జిల్లాలు (మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం) బ్యాక్ వర్డ్ జిల్లాలుగా ఉండేవన్నారు. రూ. 3 లక్షల వరకు కేంద్రం 7 శాతం వడ్డీ చెల్లిస్తే.. మిగతా కొంత వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు. మిగతా జిల్లాలకు తెలంగాణ ప్రభుత్వం వడ్డీ చెల్లించాలని డిమాండ్ చేశారు. వడ్డీ చెల్లించకుండా రూ. 3 వేల కోట్ల పైగా బకాయి పడిందని తెలిపారు.
కేంద్రానిది ఉదార స్వభావం : -
మహిళా గ్రూపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త జీవో ఇచ్చిందని, ఇంకా అమలు కాలేదన్నారు. ఎలాంటి సమస్యలు, పరిపుష్టిగా ఉన్న సంఘాలు రూ. 20 లక్షలు వరకు రుణం తీసుకోనే వెసులుబాటు ఇచ్చిందని.. రూ. 5 లక్షలు ఉన్న రుణాన్ని రూ. 10 లక్షలు పెంచిందని తెలిపారు. ఇక్కడ మహిళల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదార స్వభావం కలిగి ఉందన్నారు. 64 వేల సంఘాలు కొత్తగా ఏర్పడితే ఆ సంఘాలకు రీవాల్వింగ్ ఫండ్ ఇవ్వాల్సి ఉంటుందని.. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆ మహిళా సంఘాలకు రూ. 15 వేల రూపాయల చొప్పున రివాల్వింగ్ ఫండ్ ఇచ్చిన చరిత్ర కేంద్రానిదన్నారు. సంఘాల్లో పని చేసే మహిళల కోసం ఒక్కో మహిళకు రూ. 40 వేల గ్రాంట్ ఇస్తుందని, ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఆ సంఘాలు గుర్తొస్తాయని, నిధులు విడుదల చేస్తోందని విమర్శించారు.
అభయ హస్తం బకాయిలు ఏవీ : -
2009లో ఉమ్మడి ఏపీలో అభయ హస్తం.. స్కీం వచ్చిన విషయాన్ని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ఇందులో 22లక్షల మంది సభ్యత్వం పొందారన్నారు. 18 - 59 లోపున్న వయస్సున్న మహిళ ఇందులో చేర్చుకొనే అవకాశం ఉందన్నారు. రోజుకు ఒక్క రూపాయి చొప్పున 365 రోజులు మహిళలు చెల్లిస్తే...రూ. 365 ఏపీ ప్రభుత్వం చెల్లించిందన్నారు. 50 సంవత్సరాలు నిండిన తర్వాత వారికి పెన్షన్ రూ. 2 వేల 500 ఇవ్వడం జరుగుతుందని, అలాగే.. 9 నుంచి 12వ తరగతి చదువుకొనే పిల్లలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ. 1200 స్కాలర్ షిప్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ప్రమాదం జరిగితే రూ. 75 వేలు, అంగవైకల్యం చెందితే రూ. 32 వేల 500...సహజ మరణం జరిగితే రూ. 30 వేలు వస్తుందన్నారు. ఇలాంటి స్కీంను సీఎం కేసీఆర్ ఖతం పట్టించారని, మొత్తం రూ. 1,071 కోట్ల రూపాయలు బకాయి అయ్యిందని.. ఇలాంటి డబ్బులు పంచాల్సి ఉంటే కేవలం కొంత నగదు మాత్రమే రిలీజ్ చేశారని విమర్శించారు. మొత్తం డబ్బులు విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తల కోసం : -
మైనర్ అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్
మ్యాప్లు,మాటలలోనే అభివృద్ధి
