మ్యాప్లు,మాటలలోనే అభివృద్ధి

మ్యాప్లు,మాటలలోనే అభివృద్ధి

హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలో ముంపు ప్రాంత ప్రజల సమస్యను ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి గాలికి వదిలేసి,ఇంట్లో కూర్చొని గాల్లో లెక్కలు వేసి అభివృద్ధి చేసినట్లు  కలలు కంటున్నడని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సామా రంగారెడ్డి ఆరోపించారు. శనివారం సాయంత్రం గడ్డిన్నారం డివిజన్ వివేకానంద నగర్ వద్ద బస్తీ బాట చేపట్టి రాత్రి అదే కాలనీలో సామ రంగారెడ్డి,స్థానిక గడ్డిన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి,బీజేపీ నాయకులు,కాలనీ వాసులతో కలసి బస చేశారు. ఆదివారం ఉదయం గడ్డిన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి,కాలనీ వాసులతో కలసి సరూర్నగర్ చెరువు లోతట్టు ముంపు ప్రాంతాలు కోదండరాం నగర్,కమలానగర్,వివి నగర్,సీసల బస్తీ అంతా కలియతిరిగి సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానన్న సుదీర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ నాయకుడు,మంత్రి కేటీఆర్,ముఖ్యమంత్రి లాగా ఊక దంపుడు ముచ్చట్లు చెప్పి అభివృద్ధి జరిగిందని కలలు కంటున్నట్టున్నారని.. అది అట్లా,ఇది ఇట్లా అని ఇంట్లో కూర్చొని మ్యాప్లు వేస్తున్నారని ఏద్దేవా చేశారు. 103 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పుకునే ముంపు సమస్య పనులు ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి చెప్పే మాటలు తప్ప పరిష్కారం కావడం లేదని,ఆ మాటలు నీటి మీద రాతలే అని పేర్కొన్నారు.

వర్షాకాలం వస్తుందంటే గడ్డిన్నారం డివిజన్ లో బస్తీ వాసులు బిక్కు బిక్కు మంటూ ముంపు భయంతో బీతిల్లుతున్నారని,ముంపు సమస్య శాశ్వత పరిష్కారం చేస్తానని మాటలు చెప్పిన ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ఎక్కడ పోయారని ప్రశ్నించారు.మూడు సంవత్సరాల నుండి బాక్స్ డ్రైన్,ట్రంక్ లైన్ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయని, జీహెచ్ఎంసీ అధికారులకు బస్తీ సమస్యలు పట్టడం లేదని పేర్కొన్నారు.వరద ముంపు బాధితులకు నష్టం అంచనా వేసి లక్ష వరకు ఇస్తామని చెప్పి 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు.

బీజేపీ కార్పొరేటర్స్ కు ప్రోటోకాల్ ఇవ్వకుండా,మాజీ కార్పొరేటర్స్ తో సమావేశం,సమీక్షలు చేసుకొని అభివృద్ధి జరుగుతుందని భ్రమలో బతుకుతున్న ఎమ్మెల్యే సుదీర్ రెడ్డికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు.నియోజకవర్గంలోని అన్ని బస్తిలలో బస్తీ బాట చేపట్టి,ప్రజల సమస్యలు తెలుసుకుని,పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని అందుకు బీజేపీకి శక్తినివ్వాలని ప్రజలను సామా రంగారెడ్డి కోరారు.