అసెంబ్లీ సమావేశాలు మాటల గారడీలా సాగినయ్

అసెంబ్లీ సమావేశాలు మాటల గారడీలా సాగినయ్
  • బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు మాటల గారడీలా సాగాయని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేలా లేదని పేర్కొన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం తప్ప ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదని ఫైరయ్యారు. 

అప్పుల పాలైన తెలంగాణలో మూసీ అభివృద్ధి, యంగ్ ఇండియా స్కిల్ ప్రోగ్రాం ఏ విధంగా చేపడతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పై ఎదురు దాడికే ప్రాధాన్యత ఇచ్చిందే కానీ ప్రజా సమస్యలు ప్రస్తావించలేదని విమర్శించారు. మంత్రుల పని, మాట తీరు కూడా ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ముచ్చర్లను నాలుగో నగరంగా ప్రకటించడం ద్వారా ఏ సంకేతాలు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఆదాయం ఆ సంస్థకే చెందాలని నిర్ణయించడం సరికాదన్నారు.