ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్​ ప్లాన్​ !

ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్​ ప్లాన్​ !
  • గడువు దాకా ఆగితే ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని పీకే రిపోర్ట్​!
  • గుజరాత్​ ఎన్నికలతో వెళ్లాలంటే వచ్చే నెలలోనే అసెంబ్లీని రద్దు చేయాలి
  • ఆ తర్వాత రద్దు చేస్తే వచ్చే ఏడాది 
  • మేలో కర్నాటకతో పాటు ఎలక్షన్స్​

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం ముసురుకుంది. సీఎం కేసీఆర్​ చేసిన కామెంట్లతో ఈసారి కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్​ ప్రకారం 2023 డిసెంబర్​ వరకు ప్రస్తుత టీఆర్​ఎస్​ సర్కారుకు గడువు ఉంది.  2018 ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్​ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం ఇప్పటికే సాగుతున్నది. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై విరుచుకుపడ్డ కేసీఆర్.. ‘‘ఎన్నికల డేట్​ డిసైడ్​ చేస్తే... అసెంబ్లీ రద్దుకు నేను సిద్ధమే” అని కామెంట్లు చేయటం టీఆర్​ఎస్​ ముందస్తు మూడ్​ను బయట పెట్టింది. షెడ్యూల్​ కంటే ముందుగా ఎన్నికలు జరగాలంటే అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేయాల్సి ఉంటుందనే చర్చలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. 

వచ్చే ఏడాది 2023 డిసెంబర్​ 10వ తేదీ నాటికి  టీఆర్​ఎస్​ ప్రభుత్వ నిర్ణీత ఐదేండ్ల గడువు ముగియనుంది. అప్పటి దాకా వెయిట్​ చేయకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే.. అంతకు ముందే అసెంబ్లీని రద్దు​ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత 6నెలల్లోపు తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనేది పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘంపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అదే టైమ్​ 
వచ్చే ఏడాది 2023 డిసెంబర్​ 10వ తేదీ నాటికి  టీఆర్​ఎస్​ ప్రభుత్వ నిర్ణీత ఐదేండ్ల గడువు ముగియనుంది. అప్పటి దాకా వెయిట్​ చేయకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే.. అంతకు ముందే అసెంబ్లీని రద్దు​ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత 6నెలల్లోపు తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనేది పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘంపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అదే టైమ్​లో ఇతర రాష్ట్రాల ఎన్నికలు లేదా లోక్​సభ ఎన్నికలు జరగాల్సి ఉంటే, రెండు, మూడు నెలలు అటుఇటుగా వాటితో పాటు ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్​లో గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికలు, 2023 మే నెలలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్ లేదా కర్నాటక ఎన్నికలతోనే రాష్ట్రంలో ముందస్తుకు  వెళ్లాలని కేసీఆర్  ప్లాన్​ చేసుకున్నట్లు ఇతర పార్టీలు చెప్తున్నాయి. ఈ లెక్కన గుజరాత్​తో పాటు ఎన్నికలకు వెళ్లాలంటే..  వచ్చే నెల రోజుల్లోనే (ఆగస్టు లోపు) అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తే.. 2023 మార్చి నుంచి మే మధ్యలో కర్నాటకతో పాటు ఎన్నికలు వచ్చే చాన్స్​ ఉంటుంది. ప్రగతి భవన్ వర్గాల సమాచారం ప్రకారం.. కర్నాటక ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్​ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో కర్నాటకలో బీజేపీ బలంగా ఉంది. అందుకే ఈ 2రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే.. బీజేపీ హైకమాండ్ ఫోకస్​ కర్ణాటకపై ఎక్కువగా ఉంటుందని, తెలంగాణలో తక్కువగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో 2018 ఎన్నికలప్పుడు అవలంబించిన అడ్వాన్స్​ ఎలక్షన్​ స్ట్రాటజీ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుందని  అంచనాలు 
వేసుకుంటున్నాయి.

పీకే వార్నింగ్​ బెల్​

రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నదని, అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమైతే టీఆర్​ఎస్​కు కష్టమని ప్రశాంత్‌‌ కిశోర్‌‌ ఇప్పటికే కేసీఆర్​కు రిపోర్టులు అందించినట్లు తెలిసింది. గడిచిన ఆరు నెలలుగా సీఎం కేసీఆర్‌‌తో పాటు ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నదని, షెడ్యూల్‌‌ ప్రకారం ఎన్నికలు జరిగితే..  అప్పటివరకు  దీని ప్రభావం మరింత పెరుగుతుందని అలర్ట్ చేసినట్లు సమాచారం. అందుకే కేసీఆర్​ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని టాక్ మొదలైంది. రాష్ట్రంలో లీడర్ల  వలసలు జోరందుకున్నాయి. టీఆర్​ఎస్​ నుంచి జారుకుంటున్న నేతలు బీజేపీ, కాంగ్రెస్​లో చేరుతున్నారు. జాతీయ పార్టీలు రెండూ ప్రత్యేకంగా జాయినింగ్​ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. లీడర్ల వలసలు ఇంకా పెరిగి పోతే ఎన్నికల టైమ్​లో మరింత పట్టు చేజారుతుందనే ప్రమాదాన్ని పసిగట్టిన టీఆర్​ఎస్..​ ముందస్తుకు సిద్ధపడుతున్నదనే అభిప్రాయాలున్నాయి.

ముందస్తుకు మేం సిద్ధం

ముందస్తుకు మేం రెడీ. కేసీఆర్​ను గద్దె దింపేందుకు జనం కూడా సిద్ధంగా ఉన్నరు. ధరణిలో తప్పులను కరెక్షన్ చేయలేని కేసీఆర్​ను ప్రజలు ఓటు అనే ఆయుధంతో కరెక్షన్ చేసే రోజు దగ్గర్లోనే ఉంది. న్యాయం అడిగిన రైతులు, గిరిజనులను జైల్లో వేస్తున్నడు. 
- బీజేపీ స్టేట్​ చీఫ్ బండి సంజయ్

4 రోజుల్లో రద్దు చేసి రా

కేసీఆర్‌‌‌‌ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. ఎన్నికలకు కాంగ్రెస్​ సిద్ధంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో 90 లక్షల ఓట్లు తెచ్చుకొని కాంగ్రెస్​ సర్కారును ఏర్పాటు చేస్తం. కేసీఆర్​ పీడను వదిలించుకోవాలని ప్రజలు చూస్తున్నరు. 
- పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి

మోడీ డేట్ ప్రకటిస్తే సీఎం రెడీ

ముందస్తు ఎన్నికల తేదీని మోడీ ప్రకటిస్తే సీఎం కేసీఆర్​ కూడా ఎలక్షన్స్ కు రెడీగా ఉన్నరు. ఎన్నికలకు టీఆర్​ఎస్ ఎప్పుడూ భయపడదు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నం. ఈ విషయంలో ముందు ప్రధాని నిర్ణయం తీసుకోవాలె.  
- మంత్రి గంగుల కమలాకర్​

గడువు దాకా వెయిట్​ చేస్తే ప్రమాదమనీ..!

2018లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్‌ఎస్‌ కొన్ని నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో దాదాపు సగం సీట్లు కోల్పోయింది. మొత్తం 17 ఎంపీ సీట్లలో 4 చోట్ల బీజేపీ , 3 చోట్ల కాంగ్రెస్​ గెలిచింది. మరో సీటును ఎంఐఎం గెలుచుకుంది. అదే పరిస్థితి ఇప్పుడు కూడా రిపీటయ్యే ప్రమాదముందని టీఆర్​ఎస్ తరఫున సర్వేలు చేస్తున్న ఎలక్షన్​ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్​ కిశోర్  సీఎం కేసీఆర్​ను అలర్ట్​ చేసినట్లు తెలిసింది. షెడ్యూల్‌ ప్రకారం 2023 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అప్పటి దాకా వెయిట్​ చేస్తే.. ఎన్నికల నిర్వహణ ఈసీ చేతుల్లోకి వెళ్తుంది. లోక్​సభ సభ్యుల పదవీ కాలం గడువు మే నెలతో ముగియనుంది. మూడు, నాలుగు నెలలు అసెంబ్లీ ఎన్నికలను లేట్​ చేసి.. పార్లమెంట్‌తో పాటే జమిలి ఎన్నికల నిర్వహణకు సీఈసీ మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. రెండు ఎన్నికలు ఒకేసారి జరిగితే జాతీయ రాజకీయాల ప్రభావం తెలంగాణలో ఓటింగ్‌పై ప్రభావం చూపుతుందని, ఫలితాలు తమకు రివర్స్‌ అవుతాయనే ఆందోళన టీఆర్​ఎస్​ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది.