మా హెచ్చరికలకు బెదిరి ట్రంప్ వెనక్కి తగ్గారు: ఇరాన్

మా హెచ్చరికలకు  బెదిరి ట్రంప్  వెనక్కి తగ్గారు: ఇరాన్
  •     మేం అమెరికాతో చర్చలు జరపడం 
  • లేదు.. ఇది ట్రంప్ ​కుట్ర అని వెల్లడి
  •     హార్మూజ్​ వద్ద ఒక్కో నౌకకు 
  • 18 కోట్లు వసూలు చేస్తున్న ఇరాన్​!

టెహ్రాన్: ఇరాన్ తో చర్చలు సానుకూలంగా జరుగుతుండడంతో ఐదు రోజుల పాటు కాల్పుల విరమణ పాటిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. తాము అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష చర్చలు జరపడంలేదని ఇరాన్ విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. ట్రంప్ తన సైనిక వ్యూహాలను అమలు చేయడానికి సమయం కోసమే కుట్రపూరితంగా ఈ విరామాన్ని ప్రకటించారని ఆరోపించింది. చర్చల గురించి, వాటి ఫలితాల గురించి ట్రంప్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని తోసిపుచ్చింది. ఈమేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన కొద్ది రోజులుగా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని, చర్చలు కోసం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే పలు మిత్రదేశాలతో సందేశాలు పంపించిందని అన్నారు. అయితే టెహ్రాన్ వాటికి స్పందించలేదని చెప్పినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. మరోవైపు, చమురు ధరలను తగ్గించి, మార్కెట్లను శాంతింపజేయడానికి ట్రంప్ ఈ రకమైన "ఫేక్ న్యూస్" ప్రచారం చేస్తున్నారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ విమర్శించారు. ‘‘దురాక్రమణదారులు పశ్చాత్తాపపడేలా శిక్ష పడాలని ఇరాన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ లక్ష్యం నెరవేరే వరకు ఇరాన్ అధికారులు తమ సుప్రీం లీడర్​కు, ప్రజలకు అండగా దృఢంగా నిలబడతారు’’ అని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్ నిర్ణయంపై ఇరాన్ మీడియా ఎగతాళి

డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా తీవ్రంగా ఎగతాళి చేస్తోంది. ఇది అమెరికా బలహీనతకు, వారిలో నెలకొన్న సంకోచానికి నిదర్శనమని ఇరాన్ మీడియా సంస్థలు అభివర్ణించాయి. తాము చర్చల కంటే ఎదురుదాడి మార్గాన్నే ఎంచుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చింది. అమెరికాతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి చర్చలు జరగడంలేదని ‘ప్రెస్ టీవీ’ స్పష్టం చేసింది. ఇరాన్ సైనిక హెచ్చరికలు, పాశ్చాత్య దేశాలలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి కారణంగానే ట్రంప్ తన దాడుల ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారని  ఒక ఉన్నత స్థాయి భద్రతా అధికారి పేర్కొన్నారు.

అదొక బ్లఫ్ మాత్రమే..

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తామన్న ట్రంప్ హెచ్చరిక కేవలం ఒక ‘బ్లఫ్’ అని 'మెహర్ న్యూస్'  అభివర్ణించింది. టెహ్రాన్ దీటైన సమాధానం వల్లే వాషింగ్టన్ పునరాలోచించుకోవాల్సి వచ్చిందని, దాడుల వాయిదాయే అందుకు నిదర్శనమని పేర్కొంది. యుద్ధం నాలుగో 
వారంలోకి ప్రవేశించిన వేళ, ఇరాన్ తన పంతాన్ని వీడడం లేదని ఈ వార్తలు స్పష్టం చేస్తున్నాయి.